ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణికి వచ్చే అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కె. చంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ వారం అత్యధికంగా 99 వినతులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, తహసీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్‌లు తదితరులు పాల్గొన్నారు.
తుర్కయంజాల్: అత్యవసర పరిస్థితుల్లో సేవలందించడంలో జాప్యం చేయరాదని, వెంటనే స్పందించి 108 వాహనాన్ని సంఘటనా స్థలానికి చేర్చి బాధితులకు ప్రథమచికిత్స అందించడంతో పాటు సకాలంలో దగ్గరలోని ఆస్పత్రిలో చేర్చాలని జిల్లా ప్రోగ్రాం మేనేజన్ షేక్ జాన్ షాహిద్ అన్నారు. ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని ఇంజాపూర్‌లో సోమవారం ఆయన 108 వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనంలో పనిముట్లు, మందులు, దస్త్రాలను పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 108 సేవలను మెరుగ్గా అందించాలని సిబ్బందికి సూచించారు. సిబ్బంది కృష్ణ, లక్ష్మీకాంత్‌ను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అధికారి రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
మొయినాబాద్: భాస్కర మెడికల్ కళాశాల ఇంటర్న్స్, పీజీ విద్యార్థులకు స్టైఫండ్ వెంటనే చెల్లించాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకుడు దేవరాల రాజేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భాస్కర మెడికల్ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. ఈ విషయమై చాలాసార్లు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ)కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దీనిపై ఎన్‌ఎంసీకి చెందిన అండర్ గ్రాడ్యూయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు భాస్కర మెడికల్ కళాశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిందన్నారు. అయినా యాజమాన్యం స్పందించడంలేదని.. విద్యార్థులు ఆస్పత్రిలో కీలక సేవలు అందిస్తున్నా.. వారికి స్టైఫండ్ ఇవ్వకపోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి విద్యార్థులకు వెంటనే స్టైఫండ్ చెల్లించాలని.. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
చేవెళ్ల: జిల్లాలో మంగళవారం నుంచి ఏప్రిల్ 9 వరకు అన్ని గామ్రాల్లోని పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్లు జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్‌రావు తెలిపారు. షాబాద్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉన్న పశువులకు ఆయా మండలాల్లో ఉన్న పశువైద్యాధికారుల బృందం టీమ్‌లుగా ఏర్పడి టీకాలు వేయనున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఏడు విడతలుగా టీకాలు వేసినట్టు తెలిపారు. దీంతో 75 శాతానికిపైగా పశువుల్లో వ్యాధినిరోదక శక్తి పెరిగిందన్నారు. పూర్తిగా పెరగాలంటే 8వ విడతలో అన్ని పశువులకు టీకాలు వేయాల్సిన అసవరం ఉందన్నారు. ప్రతి రైతు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను విధిగా వేయించుకోవాలని సూచించారు.


