శంకర్‌పల్లి: నగరానికి సరఫరా అయ్యే మంజీర పైపులైన్ సోమవారం ఉదయం 4.30 గంటలకు మున్సిపల్ పరిధిలోని బుల్కాపూర్ శివారులో లీకేజీ అయ్యింది. వెంటనే అప్రమత్తమైన హెచ్‌ఎండబ్ల్యూఎస్ అధికారులు 5 గంటలకు నీటి సరఫరాను నిలిపివేశారు. తర్వాత సిబ్బంది మరమ్మతు చర్యలు చేపట్టారు. ఈ పైపులైన్ నుంచి నిత్యం నగరానికి 60 లక్షల లీటర్ల నీరు వెళ్తుంది. భారీ లీకేజీ కారణంగా సరఫరా ఆగిపోవడంతో హెచ్‌ఎండబ్ల్యూఎస్ ఎండీ అశోక్ రెడ్డి హుటాహుటిన లీకేజీ అయిన ప్రాంతానికి వచ్చి మరమ్మతు పనులను పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి, నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది సుమారు 12 గంటల పాటు శ్రమించి పునరుద్ధరణ తర్వాత సరఫరాని ప్రారంభించారు. హెచ్‌ఎండబ్ల్యూఎస్ ట్రాన్స్‌మిషన్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజశేఖర్, జనరల్ మేనేజర్ రామకృష్ణ, డిప్యూటీ జనరల్ మేనేజర్ అజిత్, మేనేజర్ జనార్దన్ పాల్గొన్నారు.
12 గంటల పాటు నిలిచిన నీటి సరఫరా
పరిశీలించిన హెచ్‌ఎండబ్ల్యూఎస్ ఎండీ అశోక్ రెడ్డి


