యాచారం: పల్లె ప్రకృతి వనం, నర్సరీల్లో మొక్కలు ఎండిపోతే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం యాచారంలో తడి, పొడి చెత్త వేరు చేసే డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, నర్సరీలను పరిశీలించారు. తడి, పొడి చెత్త వేరు చేసి సెంద్రియ ఎరువులు ఎందుకు తయారు చేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. డంపింగ్ యార్డులను నిరపయోగంగా ఉంచి నిత్యం గ్రామంలోని చెత్తాచెదారాన్ని ఎక్కడ పడేస్తున్నారని నిలదీశారు. పల్లె ప్రకృతి వనంలోని చెట్లకు నీళ్లు ఎందుకు పోయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సరీల్లో మొక్కలు ఎండిపోవడం గమనించి అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు, సిబ్బంది తీరు మార్చుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాధారాణి, సర్పంచ్ మస్కు అనితశరణం, పంచాయతీ కార్యదర్శి కిషన్ తదితరులు పాల్గొన్నారు.
డంపింగ్ యార్డు పరిశీలన
ఇబ్రహీంపట్నం: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డ్, డీఆర్సీ షెడ్‌లను అదనపు కలెక్టర్ శ్రీనివాస్ పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేరు చేసే విధానం, డంపింగ్ యార్డు నిర్వహణపై మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుదర్శన్, సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాస్


