పూల ధరలు ఇలా..
వేలాది ఎకరాల్లో బంతి, చేమంతి, గులాబీ, చాందిని తోటల సాగు
● సరైన దిగుబడి లేక దిగాలు
● సుముహూర్తాలున్నా ఎగబాకని ధరలు
● నష్టాల పాలవుతున్న పూల రైతులు
మొయినాబాద్ రూరల్: పండుగైనా పబ్బమైనా, వేడుకై నా.. వేదికైనా పూలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. పెద్దలను కలవాలన్నా.. దేవుడిని కొలవాలన్నా.. పూలు, బొకేలు పట్టుకుని వెళ్లడం గౌరవప్రదమని భావిస్తారు. కానీ పూలను పండిస్తున్న రైతులు మాత్రం నష్టాలే మూట కట్టుకుంటున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో దాదాపు 2వేలకు పైగా ఎకరాల్లో రైతులు వివిధ రకాల పూల తోటలు సాగు చేశారు. అమ్డాపూర్, కాశీంబౌలి, వెంకటాపూర్, కేతిరెడ్డిపల్లి, ఎత్‌మార్‌పల్లి, నక్కలపల్లి, చందానగర్, రెడ్డిపల్లి, మోత్కుపల్లి, నాగిరెడ్డిగూడ, బాకారం, కనకమామిడి, కంచమౌనిగూడ, చాకలిగూడ, తోల్‌కట్ట, అప్పారెడ్డిగూడ, చేవెళ్ల, కందాడ, ఆలూరు, పలుగుట్ట, పామెన, మల్కాపూర్, మునిమాలతో పాటు శంకర్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో బంతి, చేమంతి, గులాబీ, చాందిని పూల తోటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ధరలు పెద్దగా లేకపోవడంతో ఆశించిన మేర లాభాలు రావడం లేదని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
చెమటోడ్చినా దక్కని ఫలితం
ఉద్యాన పంటల సాగు కోసం కర్షకులు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. ఎకరా పొలంలో పూల తోట పెట్టేందుకు డ్రిప్‌తో పాటు మొక్కలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల కోసం ఎకరాకు సుమారు రూ.60 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. దీనికి తోడు ఇంటిల్లిపాదీ చెమటోడుస్తున్నారు. తీరా పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతున్నాయి. అకాల వర్షాలు, అతివృష్టి కారణంగా తోటలు పాడవుతున్నాయి. గతేడాది తెగుళ్లు సోకి, వాతావరణం అనుకూలించక దిగుబడులు పూర్తిగా తగ్గిపో యాయి. ఈసారి దిగుబడి కాస్త బాగుందనుకుంటున్న సమయంలో పది రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలు మళ్లీ రైతుల నడ్డి విరిచాయి. కోతకు వచ్చిన పూలు చేతికందకుండాపోయాయి. శుభకార్యాలు, పెళ్లి ముహూర్తాలు, పండుగలు వస్తున్నా పండించిన పంటకు డిమాండ్ ఉండటం లేదని పూల రైతులు పేర్కొంటున్నారు.
సిరుల వర్షం కురిపిస్తుందనే ఆశతో విరులు సాగు చేసిన రైతులకు అశ్రువులే మిగులుతున్నాయి. దిగుబడి, ధర లేక నష్టాల పాలవుతున్నారు. లాభాల పంట పండించాలని పూల తోటలు పెడితే.. అప్పులే మిగిలాయని ఆవేదన చెందుతున్నారు.
ప్రస్తుత మార్కెట్లో కిలో చేమంతి రూ.40– రూ.50, బంతి రూ.10– రూ.20, గులాబీ రూ.5– రూ.10 వరకు పలుకుతున్నాయి. వీటిని తెంపితే కూలీల డబ్బులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


