● మున్సిపాలిటీలు ప్రగతి సాధించాలి
● సీడీఎంఏ డైరెక్టర్ టీకే శ్రీదేవి
శంకర్‌పల్లి: స్వచ్ఛ నగరాల్లో ఇండోర్ మొదటి స్థానంలో ఉండగా.. దాని సరసన శంకర్‌పల్లి మున్సిపాలిటీ సైతం చేరాలని సీడీఎంఏ (కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) డైరెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 రోజుల పాటు చేపడుతున్న ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ఆమె శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభించారు. అనంతరం పాలకవర్గం, ప్రజాప్రతినిధులు, పురవాసులతో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. పారిశుద్ధ్య కార్మికులకు స్వచ్ఛ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని అన్నారు. పట్టణాలు, గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకే ప్రభుత్వం 99రోజుల బృహత్ కార్యాచరణ చేపట్టిందని, ఒక్కోరోజు ఒక్కో అంశంపై దృష్టి సారించి, పరిష్కారం చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని, అధికారులు తమకు అప్పగించిన విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అనంతరం స్వచ్ఛతపై నిర్వహించిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ శాఖ జాయింట్ డైరెక్టర్ ఫాల్గుణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ యోగేశ్, మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, వైస్‌చైర్‌పర్సన్ శ్వేత, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకయ్య అధ్యక్షతన వివిధ శాఖల మండలాధికారులు, సర్పంచులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణే ధ్యేయం
షాద్‌నగర్: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందని సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ మమత అన్నారు. మున్సిపాలిటీలో నిర్వహించిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బస్వం, వైస్ చైర్మన్ అందెమోహన్, కమిషనర్ సునీత, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్య రక్షణకు కృషి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారి డాక్టర్ నరేందర్‌కుమార్ అన్నారు. ప్రజాపాలన –ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం మొదటి రోజు మండలంలోని ఎల్మినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి, దంత, సీ్త్ర సంబంధిత వ్యాధులకు సంబంధించిన చికిత్సలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ కుమార్ మాట్లాడుతూ.. 99 రోజుల పాటు వివిధ రకాల ఆరోగ్య రక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ యాదమ్మ, వార్డు సభ్యుడు నర్సింహ, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ కృష్ణ, లక్ష్మీప్రసన్న, పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ మోహన్, రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


