కందుకూరు: సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు సమ్మెలో భాగంగా శుక్రవారం కందుకూరు విద్యుత్ డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికుల సంఘం డివిజన్ అధ్యక్షుడు ఆమనగంటి సురేష్ మాట్లాడారు. 20 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వర్తిస్తున్నా తమను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు. 30 రోజుల పని దినాలు కల్పించాలని, ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, సబ్‌స్టేషన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను ఐటీఐ అర్హత కలిగిన వారితో భర్తీ చేయాలని, ఐటీఐ లేని కార్మికులకు అర్హతను బట్టి మిగిలిన విభాగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు శివ, మహేందర్, భరత్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
యాచారం: మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని, పొందే రుణాల్లో ప్రతి మహిళ ఆర్థిక ప్రగతి సాధించాలని తెలంగాణ రాష్ట్ర సెర్ప్ ఐబీ డైరెక్టర్ నవీన్‌కుమార్ పేర్కొన్నారు. మండల ఐకేపీ కార్యాలయంలో శుక్రవారం గ్రామ సంఘాల పాలకవర్గాలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకుల్లో పొందే రుణాలు సద్వినియోగం చేసుకునేలా ఐకేపీ ఉద్యోగులు నిత్యం పర్యవేక్షణ చేయాలని అన్నారు. తీసుకునే రుణాలు, చెల్లింపుల విషయంలో ప్రతి మహిళకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సెర్ప్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కరుణాకర్, ఐబీ డీపీఎం యాదయ్య, ఐకేపీ ఏపీఎం రవీందర్, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు ప్రేమలత, సీసీలు దార గణేశ్, రాజు, జయలక్ష్మి, పద్మశ్రీ, కార్యాలయ కోశాధికారి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల: మహిళలు వంటింటికే పరిమితం కారాదని, అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని చేవెళ్ల అడిషనల్ జిల్లా కోర్టు జడ్జి బృంగి శ్రీనివాస్ అన్నారు. కోర్టు ఆవరణలో శుక్రవారం చేవెళ్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా న్యాయవాదులు, సిబ్బందికి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలు సమాజ అభివృద్ధిలో భాగం కావాలని సూచించారు. కోర్టు సూపరింటెండెంట్ ఇందిర మాట్లాడుతూ.. ఆడపిల్లలకు విద్యార్థి దశ నుంచే తల్లిదండ్రులు సరైన సహకారం అందిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కృష్ణగౌడ్, ముకరం నర్సింలు, ప్రధాన కార్యదర్శి మహేశ్‌గౌడ్, మహిళా న్యాయవాదులు మాధురి, రోజారెడ్డి, ప్రమీణ, పూజ, లోకేశ్వరి, మీనా, ఏఓ స్వరూప కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


