మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్
కొడంగల్: వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం తగదని మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ అన్నారు. బుధవారం పట్టణంలోని బస్తీ దవాఖానను సందర్శించారు. వైద్యురాలు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు సంతకాలు చేసే రిజిస్టర్ చూపించాలని అక్కడున్న సిబ్బందిని అడిగారు. జనవరి నెల నుంచి రిజిస్టర్ లేదని సమాధానం చెప్పారు. మూడు నెలలుగా సంతకాలు చేయడం లేదన్నారు. దీంతో అసహనానికి గురైన చైర్మన్ వైద్యురాలు ఎక్కడికి వెళ్లారని అడిగారు. పట్టణంలోని సబ్ సెంటర్‌కు వెళ్లారని సిబ్బంది తెలిపారు. బస్తీ దవాఖాన నుంచి సబ్ సెంటర్‌కు వెళ్లిన మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్‌లు డాక్టర్‌తో మాట్లాడుతూ రిజిస్టర్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. సంతకాలు చేసే రిజిస్టర్ కొడంగల్‌లో దొరకలేదని ఆమె సమాధానం చెప్పారు. దీంతో ఆగ్రహించిన చైర్మన్ జిల్లా వైద్యాధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వైద్యశాలల్లో రోగులకు సేవలందించంలో వైద్యులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. వెంటనే విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యులు, వైద్య సిబ్బంది ముందుండాలన్నారు.


