ఎకరం ఆక్రమణకు గురైనట్లు అధికారుల వెల్లడి
దుద్యాల్: మండల పరిధిలోని హస్నాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన భూమిని బుధవారం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. దాదాపు ఎకరం భూమి ఆక్రమణకు గురైనట్లు వెల్లడించారు. వందేళ్ల క్రితం పాఠశాలకు 4.29 ఎకరాల భూమిని కేటాయించారు. అందులో పాఠశాల భవనం, క్రీడా ప్రాంగాణం ఏర్పాటు చేశారు. కాలానుగుణంగా పాఠశాలకు చెందిన భూమిలో నుంచి హస్నాబాద్–పెద్దనందిగామ వెళ్లే రోడ్డును నిర్మించారు. దీంతో పాటు గ్రామస్తులు భూమి చివర భాగంలో పెంట కుప్పలు ఏర్పాటు చేసుకున్నారు. మరికొంత భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఇటీవల పాఠశాలకు ప్రహరీ మంజూరు కావడంతో నిర్మాణానికి భూమి పూజ చేశారు. పూర్తి స్థాయి భూమిని సర్వే చేసి హద్దులు గుర్తించి ప్రహరీ నిర్మించాలని హెచ్‌ఎంకు సూచించారు. దీంతో రెవెన్యూ సిబ్బందితో బుధవారం సర్వే చేయించారు. దాదాపు అర ఎకరం రోడ్డు నిర్మాణానికి, మరో అర ఎకరం ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. త్వరలో పూర్తి స్థాయి నివేదికను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ మహేశ్, గ్రామ పాలన అధికారి గోపాల్, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


