తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్య
హోలీ వేడుకలకు రెడీ
ఇబ్రహీంపట్నం: హోలీ వేడుకలకు ఇబ్రహీంపట్నం సిద్ధమైంది. మున్సిపల్ పరిధిలోని ఖానాపూర్ చిల్ల దగ్గర సోమవారం రాత్రి కాముని దహనం నిర్వహించారు. పట్టణంలోని పలు చౌరస్తాల్లో మంగళవారం తెల్లవారుజామున కామ దాహనానికి పలువురు ఏర్పాట్లు చేశారు. శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఆమనగల్లులో సందడి
ఆమనగల్లు: పట్టణంలో హోలీ సందడి మొదలైంది. వేడుకను పురస్కరించుకొని ప్రత్యేకంగా రంగుల విక్రయ దుకాణాలు వెలిశాయి. సోమవారం స్థానికులు వాటిని కొనుగోలు చేస్తూ కనిపించారు.
ఇబ్రహీంపట్నం: ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతీయొద్దని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్య అన్నారు. పట్టణంలో సోమవారం ఆ సంఘం మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరకొర వసతులు, ప్రైవేట్ పాఠశాలలతో తీవ్ర పోటీని ఎదుర్కొంటూ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయుల జీతభత్యాలు, పదోన్నతులపై విద్యా కమిషన్ నివేదిక సమర్పించడం యావత్ ఉపాధ్యాయ లోకాన్ని తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. ప్రస్తుతం ఉన్న పాఠశాలలను ఎలా బలోపేతం చేయాలో చెప్పాల్సిందిపోయి ఇలా నివేదిక ఇవ్వడం సరైందికాదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం విద్యాకమిషన్ సమర్పించిన రిపోర్టుపై అన్ని ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అవసరమయ్యే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతినేలా నివేదికలు ఉండొద్దన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కొట్ల కాశీరావు, ప్రధాన కార్యదర్శి పూజారి రమేష్, రాష్ట్ర మీడియా కో కన్వీనర్ సత్తారి రాజిరెడ్డి, రాజేందర్, నర్సింహ, కరుణాకర్, జంగయ్య పాల్గొన్నారు.


