● బంగారు, వెండి ఆభరణాల చోరీ
● ఎల్లకొండలో ఘటన
నవాబుపేట: ఓ మహిళను దారుణంగా హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను అపరించిన సంఘటన ఎల్లకొండ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లిలోని గణేశ్‌నగర్‌కు చెందిన మీనపల్లి బాలమణి(45) గృహిణి. ఇరవైఐదేళ్ల క్రితమే భర్తతో విడిపోయి, కొడుకు శేఖర్‌తో కలిసి అద్దె ఇంట్లో ఉంటోంది. శేఖర్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా గత 28న ఎల్లకొండలో జాతర ఉందని, తాను బంధువుల వద్దకు వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. జాతరకు తన అక్క యాదమ్మ, చెల్లెలు భారతమ్మలు కూడా వచ్చారని కొడుకుకు ఫోన్ చేసింది. అదే రోజు రాత్రి శేఖర్ మళ్లీ ఫోన్ చేయగా కల్లు దుకాణంలో ఉన్నామని, రాత్రి వీధి నాటకం చూసి పొద్దున్నే శంకర్‌పల్లికి వస్తానని చెప్పింది. మరుసటి రోజైన ఆదివారం ఉదయాన్నే శేఖర్ ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అతను పెద్దమ్మ అయిన యాదమ్మకు ఫోన్ చేయగా, ఉదయం నాలుగు గంటలకే శంకర్‌పల్లికి బయలుదేరిందని చెప్పింది. కానీ మధ్యాహ్నం దాటినా ఇంటికి రాకపోవడంతో శేఖర్ ఎల్లంకొండకు వెళ్లి, గ్రామంలోని బంధువుల ఇంటి పక్కన ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించినా అందులో కనిపించలేదు. సోమవారం ఉదయం పదకొండు గంటలకు స్థానికులు ఊరి శివారులో ఓ మహిళ మృతదేహాన్ని గమనించారు. ఈ ఫొటోలను చూసిన శేఖర్ తమ అమ్మేనని గుర్తించి వెంటనే అక్కడికి చేరుకున్నారు. సీఐ వెంకట్, ఎస్‌ఐ పుండ్లిక్ డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్‌లతో ఆధారాలు సేకరించారు. తన తల్లి ఒంటిపై మూడు తులాల బంగారు పుస్తెలతాడు, బంగారు కమ్మలు, వెండి పట్టీలు ఉన్నాయని పోలీసులకు చెప్పాడు. ఇందులో ఒక చెవి కమ్మ మాత్రమే ఉందని, గొంతు కోసి చంపారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


