చివరి దశకు సాగు
● బోర్ల కింద ఇప్పటికే 90 శాతం పూర్తి
● ఆయకట్టు కింద మిగిలిన పది శాతం
● జిల్లా వ్యాప్తంగా
93,116 ఎకరాల్లో నాట్లు పూర్తి
దుద్యాల్: వానాకాలం సీజన్‌లో చివరి వరకు వర్షాలు కురియడంతో జలశయాలు కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు సమృద్ధిగా పెరగడంతో పలువురు రైతులు బోర్ల కింద ఇప్పటికే వరి నాట్లు వేశారు. ఆయకట్టు కింద కొనసాగుతున్నాయి. ఇప్పటికే 90 శాతం పూర్తవ్వగా మరో పది శాతం నాట్లు వేసేందుకు పొలాలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరుకు నాట్లు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మండల పరిధిలోని దుద్యాల్, హస్నాబాద్, లగచర్ల, అల్లిఖాన్‌పల్లి, లగచర్ల, గౌరారం, చెట్టుపల్లి తండా. చిలుముల్ మైల్వార్, నాజుఖాన్‌పల్లి, ఆలేడ్, కుదురుమల్ల, హకీంపేట్. పోలేపల్లి, ఈర్లపల్లి, గ్రామాల్లో ఆయకట్టు రైతులు వరి నాట్లు అధికంగా వేస్తున్నారు. ప్రస్తుతం హస్నాబాద్, ఆలేడ్‌లకు ఒకే చెరువు నీరు అందుతుంది. రెండు గ్రామాల్లో దాదాపు 2వేల ఎకరాలకు పైగా వరి సాగు చేపట్టారు. దుద్యాల్‌లోనూ రెండు పెద్ద చెరువులు ఉండడంతో దాదాపుగా వేయి ఎకరాలకు పైగా వరి సాగు చేశారు. ప్రస్తుతం 11 వేలకు పైగా ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికి 93,116 ఎకరాల్లో వరి నాటు పూర్తయినట్లు జిల్లా వ్యవసాయాధికారి రాజారత్నం తెలిపారు. ఈ నెల చివరి వరకు దాదాపు 1,05,000 ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
దొడ్డు రకాలతో అధిక దిగుబడి
యాసంగి సాగులో రైతులు అధిక దిగుబడిని ఇచ్చే వరి వంగడాల వైపు మొగ్గు చూపుతున్నారు. చీడ పీడలను తట్టుకుని అధికంగా దిగుబడి అందించే రకాలను ఎంచుకుని అందుకు తగిన సాగు యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. దొడ్డు రకాలైన వరి ధాన్యం కేఎన్‌ఎం––118, ఎంటీయూ–1,121, యూటీఆర్–1010 వంటివి సాగు చేస్తున్నారు. సన్న రకాలైన ఆర్‌ఎన్‌ఆర్–15,048 ఎక్కువ విస్తీర్ణంలో వేసుకున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు అధికంగా లాభాలు పొందేందుకు 90 శాతం మంది దొడ్డు రకాలైన వరి వంగడాలను సాగు చేస్తున్నారు. వీటి దిగుబడిని అధికంగా ఉంటుందని నమ్మకం.


