ఎవరి కోఆప్షన్!
● సభ్యుల ఎంపికకు పైరవీలు
● అధికార పార్టీ నేతల చుట్టూ
ఆశావహుల ప్రదక్షిణలు
మొయినాబాద్: మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ఇక కోఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. అవకాశం దక్కించుకోవడం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చైర్‌పర్సన్ పదవిని అధికార పార్టీ దక్కించుకుంది. వైస్ చైర్మన్‌గా స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకున్నారు. 26 వార్డులు ఉన్న మున్సిపాలిటీలో నలుగురు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంది. అధికార పార్టీకి చెందినవారికే కోఆప్షన్ సభ్యలుగా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉండడంతో ఆశావహులంతా కాంగ్రెస్ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
నాలుగులో రెండు మహిళలకు..
మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల స్థానాలు నాలుగు ఉన్నాయి. వాటిలో రెండు మహిళలకు కేటాయించనున్నారు. ఇందూలోనూ మైనార్టీ, బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. ఇందుకోసం మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్‌యాదవ్, చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి భీంభరత్ తదితరులను కలిసి తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. పైరవీల మధ్య ఎవరికి అవకాశం దక్కుతుందో మరికొన్ని రోజులు వేచిచూడాలి.
పార్టీకోసం పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలి
మున్సిపల్ కోఆప్షన్ సభ్యులుగా పార్టీకోసం పనిచేసిన వారికే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జొన్నాడ రాజు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇరవై ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నామని.. తనకు కోఆప్షన్ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలన్నారు. పార్టీ బలోపేతం, విస్తరణకోసం ఎంతో కృషి చేశామని.. పనిచేసేవారిని అధిష్టానం గుర్తించాలన్నారు. కొత్తగా పార్టీలో చేరినవారికి పదవులు ఇస్తే.. పార్టీ జెండాలు మోసి కష్టపడినవారికి అన్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దలు గ్రహించాలన్నారు.


