గృహిణి అదృశ్యం
పహాడీషరీఫ్: భర్తతో గొడవపడిన గృహిణి అదృశ్యమైన సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్ గ్రామానికి చెందిన కొమిరి యాదయ్య భార్య శారద (38) కూలి పని చేస్తుంటుంది. గత నెల 26న రాత్రి భర్త, పిల్లలతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. తిరిగి రాకపోవడంతో ఆమె ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె భర్త ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు.
బావిలో పడి మహిళ మృతి
ఆమనగల్లు: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన తలకొండపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం హర్యనాయక్ తండాకు చెందిన ఇస్లావత్ లలిత (34)కు జాన్యాతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్నేళ్లుగా లలితకు ఆరోగ్యం బాగా లేదు. భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. మూడు రోజుల క్రితం ఆస్పత్రికి వెళ్తానని చెప్పి లలిత ఇంట్లో నుంచి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో బంధువులు, సమీప గ్రామాల్లో వెతికినప్పటికీ ఆచూకీ తెలియరాలేదు. ఈ క్రమంలో ఆదివారం తండా సమీపంలోని వ్యవసాయ పొలంలో ఆమె మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మృతదేహాన్ని వెలికితీశారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పదస్థితిలో ఉపాధ్యాయుడి మృతి
ఇబ్రహీంపట్నం: అనుమానాస్పద స్థితిలో ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. నగరంలోని చిలుకానగర్‌కు చెందిన శంబెళ్ల సతీష్‌కుమార్ (47) మంచాల మండలం ఆరుట్లలోని టీజీ మోడల్ స్కూల్‌లో పనిచేస్తున్నాడు. ఇటీవల బదిలీపై ఇక్కడకి వచ్చిన ఆయన ఇబ్రహీంపట్నంలోని ఓ అద్దె ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఇంటి బాత్రూమ్‌లో ఆదివారం అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న సతీష్‌కుమార్‌ను ఇంటి యజమాని గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహన్ని పరిశీలించి, ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గృహిణి అదృశ్యం
గృహిణి అదృశ్యం


