అసలే అక్రమం.. ఆపై కల్తీ!
సాక్షి, సిటీబ్యూరో: నాసిరకం ముడిసరుకులతో అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యానికి హానికరమైన సింథటిక్ రంగులు వాడుతున్న ముఠా గుట్టును శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఆదివారం రెండు ప్రాంతాల్లో దాడులు చేసి నలుగురిని పట్టుకున్నారు. రూ.10 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ వివరాలు వెల్లడించారు. జల్‌పల్లి ప్రాంతంలో అబ్దుల్ సత్తార్ అనుమతులు, లేబర్ లైసెన్స్ లేకుండా, అపరిశుభ్రమైన వాతావరణంలో ‘ఓ రాయల్ ఎంటర్ర్‌పైజెస్’, ‘షాహీ గోల్డ్ ’కంపెనీల పేరిట కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నాడు. ఈ పేస్టును స్థానిక కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. ఇతడికి జల్‌పల్లితోపాటు ముస్తాఫానగర్‌లోనూ కార్ఖానాలు ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్ పోలీసులు వాటిపై దాడి చేసి ప్రధాన నిందితుడు సత్తార్‌తోపాటు మొహమ్మద్ ఇస్మాయిల్, మొహమ్మద్ ఇఫ్తేఖర్, నూర్ నబీలను పట్టుకున్నారు. వీరి నుంచి 340 కిలోల విడి అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఒక్కోటి 50 కిలోల బరువు ఉన్న 12 పెద్ద టబ్‌ల అల్లం మిశ్రమం, ఒక్కోటి 25 కిలోల బరువు ఉన్న 20 సంచుల వెల్లుల్లి మిశ్రయం, ఐదు సంచుల ఉప్పు, అజంతా లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ బాక్సులు, సిట్రిక్ యాసిడ్ పౌడర్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసును పహాడీషరీఫ్ పోలీసులకు అప్పగించారు.
సింథటిక్ రంగులతో అల్లం వెల్లుల్లి పేస్ట్ గుట్టురట్టు చేసిన శంషాబాద్ టాస్క్‌ఫోర్స్


