దారి తప్పిన చిన్నారి.. అరగంటలో తల్లి ఒడికి
ఇబ్రహీంపట్నం రూరల్: ఆడుకుంటూ దారితప్పిన ఓ చిన్నారి అదృశ్యమైన సంఘటన ఇబ్రహీంపట్నంలో కలకలం రేపింది. స్థానిక యువకుల చొరవ, పోలీసుల సహకారంతో బాలిక అరగంటలోనే తల్లి ఒడికి చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలం, రావుట్ల గ్రామానికి చెందిన అంజలి, రాజు దంపతులకు ఏడేళ్ల కూతురు ఆధ్య ఉంది. ఇబ్రహీంపట్నం హాస్టల్‌లో ఉంటున్న తన చెల్లిని చూసేందుకు శుక్రవారం అంజలి కూతురుతో కలిసి వచ్చింది. చెల్లితో మాట్లాడుతుండగా ఆధ్య ఆడుకుంటూ బయటకు వెళ్లింది. కొద్ది దూరం రోడ్డుపై నడిచి వెళ్లిన చిన్నారి, ఆతర్వాత అయోమయానికి గురైంది. ఇది గమనించిన పలువురు స్థానికులు, యువకులు వివరాలు అడగగా సమాధానం చెప్పలేకపోయింది. దీంతో చిన్నారిని పోలీసులకు అప్పగించారు. ఆధ్యను వెతుకుతూ ఆందోళనకు గురైన అంజలి పీఎస్‌ను ఆశ్రయించింది. ఆమె వివరాలు చెబుతుండగానే పోలీసులు పాపను తీసుకుని స్టేషన్‌కు చేరుకున్నారు. చిన్నారిని చూసిన తల్లి బిడ్డను గుండెలకు హత్తుకుంది. ఎస్‌ఐ సుమలత, ఏఎస్‌ఐ సతీష్‌తో పాటు పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు చెప్పింది.


