ఇందిరమ్మ ఇళ్ల ప్రహరీల కూల్చివేత
● కాళ్లు మొక్కుతామన్న
కనికరించలేదన్న బాధితులు
● ప్రభుత్వ స్థలంలో నిర్మించారనే
కూల్చామంటున్న అధికారులు
ఇబ్రహీంపట్నం రూరల్: మాకు ఇల్లు లేదు.. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లే దిక్కు.. మీ కాళ్లు మొక్కుతాం కూల్చేయొద్దు.. కూల్చితే చచ్చిపోతాం.. అని వేడుకున్నా అధికారులు కనికరించలేదు. ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని సాహెబ్‌గూడలో ఎల్క అండాలు అనే దళిత మహిళకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. అలాగే కొహెడ పద్మ అనే మరో బీసీ మహిళకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ అందజేశారు. దీంతో గ్రామంలో వారికి ఉన్న 60 గజాల స్థలంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నారు. చుట్టూ ప్రహరీలను సైతం పూర్తి చేశారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీతా అదేశాల మేరకు మంగళవారం ఆర్‌ఐ సువర్ణ అధికారుల బృందంతో కలిసి వెళ్లారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జేసీబీతో కూల్చివేశారు. ప్రహరీలను నేలమట్టం చేశారు. దీంతో బాధితులు బోరున విలపించారు.
ప్రభుత్వ స్థలంలో కట్టినవాటినే..
సాహెబ్‌గూడలోని సర్వే నంబర్ 36 ప్రభుత్వ భూమి. ఇందులో నిర్మాణాలు చేపట్టారన్న సమాచారంతో ప్రహరీలను మాత్రమే తొలగించాం. ఇళ్లను కూల్చలేదు. ప్రభుత్వ స్థలం ఆక్రమించడం తగదు.
– సువర్ణ, రెవెన్యూ ఇన్‌స్పెక్టార్


