
లక్ష్మీదేవిపల్లిలో కదలిక!
ప్రాజెక్టు పూర్తికి చిత్తశుద్ధితో కృషి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనుల్లో మళ్లీ కదలిక వచ్చింది. పదేళ్ల క్రితమే రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటి వరకు తట్టెడుమట్టిని కూడా తవ్వలేదు. పాలకుల నిర్లక్ష్యంతో ఏళ్లుగా అపరిష్కృతంగా మారిన ఈ నిర్మాణ ప్రదేశాన్ని గురువారం ఇరిగేషన్ విభాగం చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి, ఈఈ సీతారాం నేతృత్వంలోని ఇంజనీర్ల బృందం సందర్శించడంతో నిర్మాణ పనుల్లో మరోసారి కదలిక మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్‌లో నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. సాంకేతిక అనుమతులకు తోడు నిధుల కేటాయింపు జరిగి, సకాలంలో రిజర్వాయర్ పూర్తయితే ఇటు రంగారెడ్డి, అటు వికారాబాద్ జిల్లాల్లోని 4.13 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. మీర్‌ఖాన్‌పేట కేంద్రంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా నిర్మించతలపెట్టిన ఫ్యూచర్‌సిటీకి సైతం నీటి సరఫరా కానుంది. తాగునీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలు తీరనున్నాయి.
పదేళ్ల క్రితమే శంకుస్థాపన
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా షాద్‌నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగూడెం మండలం పద్మారం రెవెన్యూ పరిధిలో 1,512 ఎకరాల విస్తీర్ణంలో సముద్ర మట్టానికి 670 మీటర్ల ఎత్తులో.. కట్టపొడవు 6.05 కిలోమీటర్లతో, 2.8 టీఎంసీల సామర్థ్యంతో కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ (చివరి ప్రాజెక్ట్)నిర్మించాలని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు 2015లోనే రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. తర్వాత ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించక పోవడం, పర్యావరణ అనుమతులు రాకపోవడం తదితర సాంకేతిక సమస్యలతో పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, సీఎం రేవంత్‌రెడ్డి ప్రతి ష్టాత్మకంగా తీసుకోవడంతోపాటు ఇప్పటికే బడ్జెట్‌లో నిధులు కేటాయించడం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత జనవరిలో ఇక్కడ పర్యటించి, త్వరలో భూసేకరణ ప్రారంభించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రిజర్వాయర్ నిర్మాణ పనుల పరిశీలన కోసం సాగునీటి పారుదలశాఖ ఇంజనీర్ల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించడంతో జిల్లా ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
సామర్థ్యం పెంచాలని విజ్ఞప్తి
క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చిన ఇంజనీర్ల బృందంతో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సమావేశమై సాంకేతిక అంశాలపై చర్చించారు. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని 2.8 టీఎంసీల నుంచి 3.8 టీఎంసీలకు పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాల్సిందిగా సూచించారు. ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అంద జేయనున్నట్లు చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూ సేకరణ, పనుల ప్రారంభంపై ఇప్పటికీ స్పష్టత రాలేదని, త్వరలోనే ఈ అంశంపై ప్రభుత్వం ఓ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని, ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉంచనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచితే మరో 500 ఎకరాలకుపైగా భూమిని అదనంగా సేకరించాల్సి ఉంటుంది. తద్వార పద్మారం, లక్ష్మీదేవిపల్లి, రాంజాతండా, సయ్యద్‌పల్లి సహా మరికొన్ని గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం లేకపోలేదు.
చౌదరిగూడలో స్థలాన్ని పరిశీలించిన ఇంజనీర్ల బృందం
రంగారెడ్డి–పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఇదే చివరిది
1,512 ఎకరాల విస్తీర్ణం.. 2.8 టీఎంసీల సామర్థ్యం
రిజర్వాయర్ పూర్తయితే
షాద్‌నగర్, పరిగి రైతులకు లబ్ధి
కొందుర్గు: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తిచేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల రిజర్వాయర్ కోసం గుర్తించిన లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు స్థలాన్ని వారు ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ఈ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని నమ్మించి మోసం చేశాయన్నారు. ఈ రిజర్వాయర్‌కు ఉదండాపూర్ నుంచి నీటిని తేవడమే గాక దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల, జూరాల నుంచి నీటిని తెచ్చి త్రివేణి సంగమం చేస్తామని అన్నారు. ప్రస్తుతం 2.8 టీఎంసీలుగా ప్రతిపాదించిన రిజర్వాయర్‌ను 3.8 టీఎంసీల సామర్థ్యానికి పెంచేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.
నివేదిక సిద్ధం చేస్తాం
ఇరిగేషన్ అధికారులు శ్రీనివాస్‌రెడ్డి, సీతారామ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేల సూచనమేరకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సామర్థ్యం పెంపుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం 2.8 టీఎంసీలకు 1,512 ఎకరాలు అవసరమని, 3.8 టీఎంసీలు పెంచితే ఇంకా ఎంత భూమి అవసరమవుతుందో సర్వే చేస్తే తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు కృష్ణా రెడ్డి, కావలి రాజు, నాయకులు మల్లేశ్‌గౌడ్, పురుషోత్తం రెడ్డి, గోవర్దన్ గౌడ్, చంద్రశేఖర్, నరేందర్, రామయ్య గౌడ్, కృష్ణయ్య, కృష్ణ, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.