
25,000 మెట్రిక్ టన్నులు
ప్రస్తుత సీజన్‌లో జిల్లాలో యూరియా డిమాండ్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: వరుణుడు కరుణించినా.. వ్యవసాయశాఖ కరుణించకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏకధాటి వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. బోరుబావుల్లో నీటి నిల్వలు పైకి ఉబికివస్తున్నాయి. ఫలితంగా చెరువుల కిందే కాదు బోరుబావుల కింద వరిసాగు పెరిగింది. ఖరీఫ్ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాల్లో పంట సాగైనట్లు అంచనా. వీటిలో 1.20 లక్షల ఎకరాల్లో పత్తి, లక్ష ఎకరాలకుపైగా వరిసాగు, మరో 60వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగైనట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. చెరువులు, కుంటలు నిండి భూగర్భ జలాలు పైకి ఉబికి వస్తుండటంతో రైతులు వరిసాగుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే చాలామంది వరినాట్లు పూర్తి చేశారు. పత్తి పూత, కాపు దశకు చేరుకుంది. చేను ఏపుగా పెరిగేందుకు యూరియా చల్లాల్సి ఉంది. అందు కోసం ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు, ఎరువుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూతపడటం, మద్రాసులోని పలు కేంద్రాల్లోనూ ఉత్పత్తి తగ్గించడంతో దిగుమతి తగ్గింది. ఇదే సమయంలో జిల్లా డిమాండ్‌ను అంచనా వేయలేక పోయారు. డిమాండ్‌కు సరఫరా మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ప్రస్తుత సీజన్‌లో జిల్లాకు 25,000 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా, ఇప్పటి వరకు 21 మెట్రిక్ టన్నులు మాత్రమే దిగుమతి అయింది. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న ఎరువులను 27 ప్రభుత్వ మార్క్‌ఫెడ్ (60శాతం) పీఏసీఎస్‌లు సహా 156 ప్రైవేటు డీలర్ల (40శాతం) ద్వారా రైతులకు చేరవేస్తున్నారు. పంట డిమాండ్ మేరకు మార్కెట్లో ఎరువులు దొరకడం లేదు.
ఉదయాన్నే క్యూ..
రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకాలు పట్టుకుని ఉదయాన్నే ఆయా కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. పది బస్తాలు అవసరం ఉన్నవారికి ఐదు బస్తాలతో సరిపెడుతున్నారు. మరో దఫా మిగిలి నవి ఇస్తామని చెప్పి పంపుతున్నారు. ఇదే సమయంలో కొంత మంది డీలర్లు ఎరువులను గుట్టుగా ప్రైవేటు గోదాములకు తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మించి విక్రయిస్తున్నారు. రైతులు చేసేది లేక వారు చెప్పిన ధరలు చెల్లించి తీసుకెళ్తున్నారు. తాజాగా గురువారం కడ్తాల్, కందుకూరు, మంచాల, షాబాద్, శేరిగూడ, యాచారం, కేశంపేట తదితర ప్రాంతాల్లో ఎరువుల కోసం ఎగబడ్డారు. విక్రయ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేసిన ఎరువులను మండల వ్యవసాయాధికారులు పోలీసుల పహారాలో అందజేశారు. కొన్ని చోట్ల రైతులు వ్యాపారులతో వాగ్వాదానికి దిగారు. డిమాండ్ మేర సరఫరా చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు.
ఇప్పటి వరకు సరఫరా 21,000 మెట్రిక్ టన్నులు
ఎరువుల దుకాణాలకు
అన్నదాతల బారులు
ఒక్కో రైతుకు రెండు, మూడు సంచులతో సరి
పంటకు సరిపడా దొరక్క ఆందోళన

25,000 మెట్రిక్ టన్నులు