
చిలుకూరు పెద్ద చెరువు పరిశీలన
మొయినాబాద్: ప్రమాదస్థాయికి చేరిన చిలుకూరు పెద్ద చెరువును అదనపు కలెక్టర్ శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. చెరువు అలుగు కింది నుంచి నీరు సాఫీగా వెళ్లేలా శాశ్వత పరిష్కారం చేపట్టాలని మున్సిపల్, ఇరిగేషన్ అధికారులకు సూచించారు. చెరువు అలుగు కింది భాగం నుంచి నాలా, సీసీ రోడ్డు నిర్మాణం, ఆర్ అండ్ బీ రోడ్డుపై వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. రోడ్డుపై పారుతున్న నీటిలోనుంచే వాహనాలు వెళ్తుండడంతో ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ గౌతమ్‌కుమార్, ఇరిగేషన్ డీఈ పరమేశ్వర్, మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్, సిబ్బంది వెంకటేశ్, నర్సింహ తదితరులు ఉన్నారు.
రోడ్డుపై ఇరుక్కున్న తహసీల్దార్ వాహనం
చెరువును పరిశీలించేందుకు వెళ్లిన తహసీల్దార్ గౌతమ్‌కుమార్ కారు కాలువ నీటిలో ఇరుక్కుపోయింది. అలుగు కింది భాగంలో కాలువపై ఏర్పాటు చేసిన రోడ్డులో కారు కొంత దూరం వరకు వెళ్లింది. అక్కడి నుంచి అధికారులు నడుచుకుంటూ వెళ్లారు. కారును వెనక్కి తిప్పే క్రమంలో రోడ్డుపై ఇరుక్కుపోయింది. అక్కడనున్నవారంతా పది నిమిషాల పాటు శ్రమించి బయటకు తీశారు.
మున్సిపల్ కార్యాలయంలో తనిఖీ
చేవెళ్ల: కొత్త మున్సిపాలిటీ గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సూచించారు. చేవెళ్ల మున్సిపాలిటీని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తాత్కాలిక భవనంలో సెక్షన్లవారీగా ఏర్పాటు చేసిన అధికారుల చాంబర్లను పరిశీలించారు. కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది వివరాలను మున్సిపల్ కమిషనర్ వెంకటేశంను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయాలన్నారు. నిమజ్జనం చేసే ప్రాంతాల్లో కావాల్సిన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.