
షాద్‌నగర్: సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్‌రావు అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వ్యాధుల ప్రబలే అవకాశం ఉందని తెలిపారు. ఈగలు, దోమల కారణంగా మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని, వైద్య సిబ్బంది వ్యాధుల బారిన పడిన వారిని గుర్తించి తగిన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
ప్రతి ఒక్కరూ పౌష్టిక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడి ఆహారం తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎవరైనా వ్యాధుల బారిన పడితే వెంటనే సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని, కావల్సిన మందులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్‌ఎంపీలు అర్హతకు మించి వైద్యం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి, ఆస్పత్రి సూపరింటెండెంట్ విష్ణువర్ధన్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.