
తండ్రిని చంపిన కొడుకుకు రిమాండ్
మొయినాబాద్: మద్యం తాగి పనికి వెళ్లకుండా గొడవలు పెడుతున్నాడనే కారణంతో తండ్రిని కొట్టి చంపిన కొడుకును రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని ముర్తూజగూడకు చెందిన మహ్మద్ అజ్జుఖాన్(50) కూలీ పనులుచేసేవాడు. ఈనెల 6న ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, తన వద్ద డబ్బులు తీసుకుని పనికి ఎందుకు రాలేదని అజ్జుఖాన్‌ను అడిగాడు. ఇదే విషయమై అజ్జుఖాన్ భార్య సైతం నిలదీస్తుండగా అక్కడికి వచ్చిన కొడుకు మహ్మద్ అజీమ్‌ఖాన్ తండ్రిపై కోపోద్రిక్తుడయ్యాడు. మద్యం తాగి పనికి వెళ్లకుండా గొడవ పెడుతున్నావంటూ కర్ర తీసుకుని తలపై బాదడంతో అజ్జుఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈనెల 14న మృతి చెందాడు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేసిన పోలీసులు సోమవారం నిందితుడు అజీమ్‌ఖాన్‌ను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.