
చెరువులో పడి బాలుడి మృతి
● నాదర్‌గుల్ సున్నం చెరువులో ఘటన
● మృతదేహాన్ని వెలికి తీసిన అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది
ఇబ్రహీంపట్నం రూరల్: సైకిల్‌తో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి, మతిస్థిమితం లేని బాలుడు మృతి చెందిన సంఘటన ఆదిబట్ల పీఎస్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. బడంగ్‌పేట్ మున్సిపాలిటీ నాదర్‌గుల్‌లోని ఆశోక్‌రెడ్డి కాలనీలో నివాసం ఉండే మహ్మద్ అజ్మత్‌అలీ, అయేషాల దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు కాగా, చిన్నవాడు ఉమైర్(6) మానసిక పరిస్థితి బాగోలేదు. దీంతో తల్లితో పాటు ఇంట్లో ఉండేవాడు. రోజు ఆడుకోవడానికి బయటకు వెళ్తుంటాడు. అతన్ని గమనిస్తూ తల్లి ఇంటి పనులు చేసుకునేది. సాయంత్రం ఇంట్లో ఉన్న చిన్న సైకిల్ తీసుకుని బాలుడు బయటకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత ఉమైర్ కోసం వెతకగా కనిపించలేదు. కాలనీలోని చిన్నారులను అడగగా సైకిల్ తీసుకుని చెరువు కట్టవైపు వెళ్లాడని చెప్పారు. అక్కడికి వెళ్లి వెతుకుతుండగా కట్టపై సైకిల్ కనిపించింది. కంగారు పడిన తల్లి పోలీసులకు సమాచారం అందించింది. అగ్నిమాపక సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు చెరువులో వెతకగా ఉమైర్ మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిమిత్తం బాడీని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల రోదనలతో ఆప్రాంతం దద్దరిల్లింది.
గృహిణి అదృశ్యం
పహాడీషరీఫ్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన చక్రధర్ ఐదేళ్ల క్రితం తన భార్య జయంతి(26)తో కలిసి జీవనోపాధి నిమిత్తం జల్‌పల్లిలోని శ్రీరాం కాలనీకి వలస వచ్చాడు. ఈ నెల 22న ఒడిశాకు వెళ్తానని చెప్పిన జయంతి పుట్టింటికి వెళ్లలేదు. ఆమె ఆచూకీ కోసం అన్ని ప్రాంతాల్లో వెతికినా లాభం లేకపోవడంతో భర్త ఆదివారం పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాన్ బ్రోకర్‌పై కేసు నమోదు
ఫిలింనగర్: తాకట్టు పెట్టిన బంగారు నగలతో పాటు వడ్డీకి తీసుకున్న డబ్బులతో పరారైన పాన్‌బ్రోకర్‌పై ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్, గౌతంనగర్ బస్తీలో రాజస్థాన్‌కు చెందిన మాణిక్‌చౌదరి అనే పాన్ బ్రోకర్ నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. స్థానికులు చాలామంది అతడి వద్ద ఆభరణాలు తాకట్టుపెట్టి అప్పు తీసుకున్నారు. ఇటీవల షాపు ఎత్తేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బసవతారకనగర్ బస్తీకి చెందిన జనార్దన్‌రెడ్డి అనే వ్యక్తి ఐదు తులాల బంగారం తాకట్టు పెట్టి అప్పు తీసుకుని ఆగస్టు 4న రూ.2.55 లక్షలు చెల్లించాడు. ఈ నెల 18న బంగారం తిరిగి ఇస్తానని చెప్పిన మాణిక్‌చౌదరి బోర్డు తిప్పేయడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అపోలో ఆస్పత్రి బాలాజీ టెంపుల్‌లో పూజారిగా పనిచేస్తున్న ఆరుట్ల వెంకటరమణ రూ.18 లక్షలు తీసుకుని మోసం చేశాడు. ఫిలింనగర్ పోలీసులు నిందితుడు మాణిచౌదరిపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఫిలింనగర్‌లో పలువురిని నమ్మించి రూ. లక్షలు వసూలు చేయడమే కాకుండా పలువురు రాజకీయ నాయకుల వద్ద కూడా డబ్బులు తీసుకుని మోసం చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. సుమారు రూ.10 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం.

చెరువులో పడి బాలుడి మృతి