
ధరలు ‘గణ’ం
ఈసారి 20 శాతానికిపైగా పెరిగిన వినాయక విగ్రహాల రేట్లు
సాక్షి, సిటీబ్యూరో: భక్తకోటి ఇష్టదైవం బొజ్జ గణపయ్య వేడుకల కోసం నగరం సిద్ధమవుతోంది. మండపాల అలంకరణ, విగ్రహాల కొనుగోళ్లు, పూజా సామగ్రి విక్రయాలతో సందడి నెలకొంది. ఈసారి గణనాథుడి విగ్రహాల ధరలకు రెక్కలొచ్చాయి. గత ఏడాది కంటే 20 శాతానికి పైగా ధరలు పెరిగినప్పటికీ అమ్మకాలు జోరుగానే సాగుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మండపాల నిర్వాహకులు, కాలనీలు, అపార్ట్‌మెంట్ సంక్షేమ సంఘాలు పెద్ద ఎత్తున విగ్రహాలను కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ధూల్‌పేట్, నాగోల్, ఎల్‌బీనగర్, ఉప్పల్, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు, మియాపూర్ తదితర ప్రాంతాల్లో విగ్రహాల అమ్మకాలు ఊపందుకున్నాయి. 20 ఫీట్ల ఎత్తు ఉన్న విగ్రహాలు గత సంవత్సరం రూ.85 వేల వరకు విక్రయించగా, ఈసారి రూ.లక్ష దాటింది. ఎక్కువ మంది కొనుగోలు చేసే 12 ఫీట్లు, 16 ఫీట్ల విగ్రహాల ధరలు కూడా బాగా పెరిగాయి. గత సంవత్సరం రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు లభించిన విగ్రహాల ధరలు ఇప్పుడు రూ.70 వేల నుంచి రూ.80 వేలు దాటాయి. విగ్రహాలకు అదనపు అలంకరణలు, హంగూ ఆర్భాటాలకు అనుగుణంగా ధరలను పెంచారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర ముడిపదార్ధాలు, రవాణా తదితర ఖర్చులు భారీగా పెరగడంతో విగ్రహాల ధరలను కొంత మేరకు పెంచాల్సి వచ్చినట్లు ధూల్‌పేట్‌కు చెందిన బబ్బూసింగ్ తెలిపారు. ధూల్‌పేట్‌లోనే తయారు చేసిన 12 జ్యోతిర్లింగాల మహాకాళ వినాయక విగ్రహాన్ని రూ.2 లక్షల వరకు విక్రయించారు.
దారులన్నీ ధూల్‌పేట్‌వైపే..
తెలంగాణలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోనూ ధూల్‌పేట వినాయక విగ్రహాలకు ఎంతో ఆదరణ ఉంది. దీంతో అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకు వచ్చి నచ్చిన విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. 5 ఫీట్ల నుంచి 30 ఫీట్ల భారీ విగ్రహాల వరకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మరోవైపు 12 ఇంచులు, 6 ఇంచుల విగ్రహాలు కూడా విక్రయిస్తున్నట్లు రాకేష్ సింగ్ తెలిపారు. 20 నుంచి 30 అడుగుల వరకు ఉన్న విగ్రహాలు, వాటి ఆకృతులు, డిజైన్‌లు, వినియోగించిన రంగులు, ఫైబర్, తదితరాల ఆధారంగా రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు ధరలు ఉన్నాయి. ధూల్‌పేట్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వైవిధ్యభరితమైన విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వినాయక విగ్రహాలతో పాటు దుర్గామాత ఉత్సవాలకు అనుగుణంగా విగ్రహాలను తయారు చేసే ధూల్‌పేట దక్షిణాది రాష్ట్రాలకే ప్రధాన మార్కెట్‌గా ఉంది. కానీ కొంతకాలంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా విగ్రహాలను హైదరాబాద్‌కు తరలించి విక్రయిస్తున్నారు. దీంతో పోటీ బాగా పెరిగిందని ధూల్‌పేటకు చెందిన రాజేశ్వరి తెలిపారు.
నిర్వహణ కూడా భారీగానే..
అపార్ట్‌మెంట్‌లు, కాలనీ అసోసియేషన్‌లు, యువజన సంఘాలు, భక్తసమాజాలు నవరాత్రి ఉత్సవాలకు సన్నద్ధమవుతున్నాయి. బుధవారం నుంచి ప్రారంభం కానున్న గణనాథుడి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గ్రేటర్‌లో సుమారు 4 వేలకు పైగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్‌లు ఉన్నట్లు అంచనా. ఖైరతాబాద్, బాలాపూర్ సహా ప్రధాన మండపాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా అపార్ట్‌మెంట్‌లు, బహుళ అంతస్తుల భవనాలు భారీ మండపాలను ఏర్పాటు చేస్తున్నాయి. విగ్రహాలతో పాటు ఏర్పాట్లు, నిర్వహణ ఖర్చులు సైతం భారీగానే పెరుగుతున్నాయని నిజాంపేట్‌కు చెందిన ఓ అపార్ట్‌మెంట్ కార్యదర్శి తెలిపారు.
మండపాలు, నిర్వహణ ఖర్చులూ అధికమే
20 అడుగుల విగ్రహం రూ.లక్షకుపైగానే
అయినా జోరు తగ్గని విక్రయాలు
ధూల్‌పేట్, నాగోలు, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో సందడి

ధరలు ‘గణ’ం