
స్క్రాప్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం
కుషాయిగూడ: ఓ స్క్రాప్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం జరిగిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌ష్టేషన్ పరిధిలోని సాయికృష్ణనగర్ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జమ్మిగడ్డకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి గత కొంత కాలంగా ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకుని స్క్రాప్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి స్క్రాప్ గోడౌన్‌లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీనిపై సమాచారం అందడంతో కుషాయిగూడ పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఆరు గంటల పాటు శ్రమించి సోమవారం తెల్లవారుజామున మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాథమిక సమాచారం మేరకు 30 లక్షల వరకు ఆస్థినష్టం జరిగి ఉంటుందని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇన్‌స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి తెలిపారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. నిర్వాహకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.