
చూస్తోంది ఏఐ
ఇట్టే పట్టేస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఓ గ్రామ కార్యదర్శి సెలవు పెట్టకుండా ఆన్‌డ్యూటీలో పెళ్లి చూపులకు వెళ్లాడు. ఉదయం పెళ్లి చూపులు ముగించుకుని మధ్యాహ్నం ఆఫీసుకు చేరుకున్నాడు. ఆయన తన ఫోన్‌ను అటెండర్‌కు ఇచ్చి లొకేషన్ నుంచి యాప్‌లో హాజ రు వేయించాల్సిందిగా సూచించాడు. అటెండర్ సదరు కార్యదర్శి ఫొటోకు బదులు తన ఫొటో లొకేషన్ నుంచి షేర్ చేశాడు. అప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ యాప్’ గుర్తించింది. సమాచారాన్ని వెంటనే ఉన్నతాధికారులకు చేరవేసింది. ఆరా తీయగా అసలు విషయం బయటికొచ్చింది. దీంతో సదరు కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇలా విధులకు డుమ్మా కొడుతూ ఒకరికి బదులుగా మరొకరితో ఫేక్ అటెండెన్స్ వేయించుకుంటున్న కార్యదర్శుల తీరుపై జిల్లా పంచాయతీ విభాగం సీరియస్ అయింది. ఇప్పటికే ఆమనగల్లు మండలం సింగంపల్లి కార్యదర్శి సహా ఫరూఖ్‌నగర్ మండలం బీమారం కార్యదర్శులపై ఇదే అంశంలో సస్పెండ్ చేసింది. వీరితో పాటు మరో ఐదుగురిపై చర్యలు తీసుకుంది.
ఫేక్ అటెండెన్స్‌కు స్వస్తి చెప్పేందుకే..
జిల్లా వ్యాప్తంగా 526 గ్రామ పంచాయతీలు ఉండగా, 318 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, 73 మంది ఔట్ సోర్సింగ్ కార్యదర్శులు పని చేస్తున్నారు. గ్రామాల అభివృద్ధిలో వీరే కీలకం.ఇంటి నిర్మాణ అనుమతులు, పన్నుల వసూళ్లు సహా పారిశుద్ధ్య నిర్వహణ, వీధిలైట్లు, తాగునీటి సరఫరా, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాల పర్యవేక్షణ వంటివి చూసుకోవాల్సి ఉంది. మెజార్టీ కార్యదర్శులు గ్రామాలకు వెళ్లకుండానే వెళ్లినట్లు తప్పుడు హాజరు న మోదు చేయిస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి బాగోగులు చూసుకోవాల్సిన కార్యదర్శులు తరచూ విధులకు గైర్హాజరవుతున్నారు. ఈ ఫేక్ అటెండెన్స్ విధానానికి స్వస్తి పలకాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం బయోమెట్రిక్ ఐరీస్ అటెండెన్స్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పంచాయతీ కార్యదర్శుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో తాత్కాలికంగా దాన్ని నిలిపివేసింది. ప్రత్యామ్నాయంగా ఎనిమిది నెలల క్రితం ‘ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్’విధానాన్ని ప్రవేశపెట్టింది. కార్యదర్శులు ప్రతి రోజూ ఉదయం పది గంటలకు విధులు నిర్వర్తించే పంచాయతీ లొకేషన్‌కు చేరుకుని ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ యాప్ ద్వారా ఫొటో తీసి పంచాయతీ యాప్‌లో వేసి హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంది.
అవగాహన లేకే..
ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ యాప్‌పై మెజార్టీ కార్యదర్శులకు అవగాహన లేదు. తెలియక కొంత మంది తప్పు చేస్తే..తెలిసి మరికొంత మంది తప్పు చేసి దొరికిపోతున్నారు. ఇప్పటికే ఎనిమిది మందిపై సస్పెన్షన్ వేటు పడింది. మరో పదిహేను మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. విధి నిర్వహణలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇట్టే దొరికిపోయే అవకాశం ఉంది. అంతేకాదు ఫిర్యాదులకు స్పందించకుండా, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కార్యదర్శులపై కూడా నిఘా కొనసాగుతోంది.