
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును తరలించొద్దు
ఇబ్రహీంపట్నం: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తరలించొద్దంటూ సీపీఎం, బీజేపీ సోమవారం వేర్వేరుగా ఆందోళనబాట పట్టాయి. సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సామేల్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల నుంచి వృద్ధులు, మహిళలు దూర ప్రాంతానికి రిజిస్ట్రేషన్లకు వెళ్లాల్సివస్తే ఇబ్బందులు పడతారన్నారు. ఇబ్రహీంపట్నం ఎస్‌ఆర్వో కార్యాలయాన్ని మంఖాల్‌కు తరలించే యోచనను విరమించుకోవాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బుగ్గరాములు, జగన్, ఎల్లేష్, వీరేశం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన రహదారిపై బీజేపీ రాస్తారోకో
ఎస్‌ఆర్వో కార్యాలయాన్ని తరలించొద్దని బీజేపీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు, మాజీ కౌన్సిలర్లు ముత్యాల భాస్కర్, నాయిని సత్యనారాయణ మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాలుగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తరలించడం భావ్యం కాదన్నారు. స్థానిక పాత బస్టాండ్ వద్ద శాశ్వత భవన నిర్మాణం అసంపూర్తిగా ఆగిపోయిందని, నిర్మాణాన్ని పూర్తి చేసి అందులోకి మార్చాలని కోరారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ముత్యాల మహేందర్, కిషాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జక్క రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో వినతులు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తరలించొద్దని సోమ వారం నిర్వహించిన డివిజన్ ప్రజావాణిలో వినతులు వెల్లువెత్తాయి. రియల్ వ్యాపారులు, స్థానికులు తహసీల్దార్ సునీతకు వినతిపత్రాలు అందజేశారు.