
పారితోషికం తగ్గిస్తే ఊరుకోం
ఇబ్రహీంపట్నంరూరల్: ఆశ వర్కర్లు పని చేయడం లేదని, వారికిచ్చే పారితోషికంలో కోత పెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రం పెంచిన పారితోషికాలను రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా అమలు చేయాలని అన్నారు. రూ.18వేలు ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించి, పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. 2021 జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరు నెలల పీఆర్‌సీ, ఎరియర్స్ వెంటనే చెల్లించాలని కోరారు. గతంలో ఇచ్చిన హామీల ప్రకారం ఇన్సూరెన్స్ రూ.50 వేలు చెల్లిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఆదివారం, పండుగలకు సెలవు ఇవ్వాలని, ప్రభు త్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక గదులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రుద్రకుమార్, కార్యదర్శి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.