
భూములు ఇచ్చేది లేదు
కందుకూరు:మండలంలోని తిమ్మాపూర్ రెవెన్యూలో అసైన్డ్ భూముల సేకరణకు ప్రభు త్వం సిద్ధమైంది. సర్వే నంబర్లు 38, 162లోని 566.39 ఎకరాల అసైన్డ్ భూములను టీజీఐఐ సీ ద్వారా పారిశ్రామిక పార్కుకు సేకరించడానికి గతంలో నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా సోమవారం ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి సమక్షంలో గ్రామ సభ నిర్వహించి రైతుల అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం ఎకరాకు మూడు రెట్లు అంటే రూ.59.40 లక్షల మేర పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. భూములను ప్రభుత్వానికి ఇచ్చి సహకరించాలని కోరారు. రైతులు మాత్రం ఎన్నో ఏళ్లుగా ఆ భూములనే నమ్ముకుని జీవిస్తున్నామని, ప్రభుత్వానికి ఇస్తే ఉపాధి కోల్పోతామని ఇచ్చేదిలేదని తేల్చి చెప్పారు. 20 ఏళ్లకు పైగా సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను పట్టాగా చేస్తామని గతంలో అధికార పార్టీ ప్రకటించిందని, ఆవిధంగా మార్చాలని కోరారు. ఈ విషయమై ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తామని అధికారులు వారికి తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాల్, సీఐ సీతారామ్, నాయబ్ తహసీల్దార్ రాజు, ఆర్‌ఐ యాదగిరి, టీజీఐఐసీ మేనేజర్ అజీజసుల్తానా తదితరులు పాల్గొన్నారు.