
గణేశ్ ఉత్సవాలకు డీజే అనుమతి లేదు
ఇబ్రహీంపట్నం రూరల్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు డీజేలకు అనుమతి లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు స్పష్టం చేశారు. ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకొనేలా చూడాలన్నారు. విగ్రహాల ఏర్పాటుకు తప్పనిసరి ఆన్‌లైన్ అనుమతులు తీసుకోవాలన్నారు. పోలీసు సిబ్బంది ప్రతి మండపం వద్దకు వెళ్లి పరిశీలించాలన్నారు. ప్రభుత్వం మండపాలకు ఉచిత విద్యుత్ అందజేస్తోందని తెలిపారు. విద్యుత్, అగ్నిప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగే విధంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవంగా మసలు కోవాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టేషన్‌లో నమోదైన కేసుల పురోగతి గురించి సీఐని అడిగి తెలుసుకున్నారు. సీపీ వెంట డీసీపీ సునీతారెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు తదితరులు ఉన్నారు.