
హరితం.. ఆహ్లాదం
● ఇంటి ఆవరణలో మొక్కలు నాటేందుకు అనువైన సమయం
● వనమహోత్సవంలో భాగంగా మొక్కల పంపిణీ
షాద్‌నగర్: ఇటీవల ఇంటి ఆవరణలో మొక్కల పెంపకంపై ఆకస్తి పెరిగింది. వర్షాలు కురుస్తుండటంతో మొక్కలు నాటడానికి అనువుగా ఉంటుంది. ప్రభుత్వం వనమహోత్సం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేస్తుంది.
వాయుకాలుష్యంతో ముప్పు
రోజు రోజుకు వాతావరణం కలుషితమవుతతోంది. చెట్ల సంఖ్య తగ్గడంతో సహజంగానే ధూళి కణాలు గాలిల్లో కలుస్తున్నాయి. ఫలితంగా ఇది ప్రజారోగ్యానికి శాపంగా మారింది. ప్రతి ఏటా వాయు కాలుష్యంతో పలువురు మృత్యువాత పడుతుండగా ఎందరో అనారోగ్యానికి గురవుతున్నారు.
మొక్కలు నాటడం
● వర్షాలు కురుస్తుండటంతో ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో మొక్కలు నాటుకోవచ్చు.
● ఇండోర్ ప్లాంట్ల పై ఇటీవల ఆసక్తి కనబరుస్తున్నారు.
● మల్లె, చామంతి, గులాబీ, ఆర్‌కే ఫామ్, సైకస్, కాకస్, జెర్బరా, ఉసిరి, లిల్లీ, అశ్వగంధ, ఆర్బిడ్, క్రోటాన్, మనీప్లాంట్, స్నే ప్లాంట్, పుదీనా, తులసీ, అలోవెరా, సరస్వతీ తదితర రకాలు ఇంటి పరిసరాల్లో నాటుకోవచ్చు.
● జమ్మి, మేడి, ఉత్తరేణి, తెల్ల జిల్లేడు, దత్తాత్రేయ, మారేడు, గరిక, బ్రహ్మ కమలం, వంటి నవగ్రహాల మొక్కల సైతం నాటుకోవచ్చు.
● స్ధ్ధలం ఎక్కవగా ఉంటే మామిడి, సీతాఫలం, జామ, వాటర్ ఆపిల్, బత్తాయి, జామ, దానిమ్మ, వంటి పండ్ల మొక్కలను నాటొచ్చు.
కురగాయలకు ఎండే అండ
నేల పై లేదా ఇంటి మేడ పై ప్లాస్టిక్ గ్రో బ్యాగులు, సిమెంట్ కుండీల్లో, పాత బకెట్లు, రంజన్లలో మొక్కలు పెంచుకోవచ్చు. అద్దె ఇంటిలో ఉంటున్న వారు కుండీల్లో పెంచితే మరో చోటుకు సులభంగా తరలించవచ్చు. తీగ జాతి మొక్కలతో చిన్న మొక్కలకు ఇబ్బంది రాకుండా తాళ్ల సాయంతో పైకి పాకించాలి. చీడ పీడలు ఆశిస్తే వేపనూనె లేదా కార్బండిజం, మ్యాంకోజెబ్, మోనోక్రోటోపాస్ కలిపిన మిశ్రమాన్ని మొక్కల పై పిచికారీ చేయాలి. రోజులో కనీసం ఆరు గంటలు సూర్వరశ్మి తగిలే ప్రాంతాల్లో టమాట, బీర, బెండ, పొట్ల, చిక్కుడు, కాకర, వంకాయ, మిరపలతో పాటు ఆకు కూరల సాగుకు అనుకూలంగా ఉంటుంది.
మట్టి ఎప్పుడు మార్చాలంటే..
● ప్రతీ రెండేళ్లకు వానాకాలం ఆరంభంలో కుండీల్లోని మట్టిని మార్చాలి.
● ఎర్ర మట్టి లేదా సారవంతమైన మన్ను, ఇసుక, పశువుల పేడ, వర్మికంపోస్టు, ఎండుటాకులు, రంపపు పొట్టు, బొగ్గు, లిండేన్ పొడిని కలిపి కుండీల్లో నింపుకోవాలి.
● కుండీల్లో తయారయ్యే అమ్మోనియాన్ని బొగ్గు పీల్చేస్తుంది. లిండేన్ పొడి పురుగులను చంపుతుంది. ఇసుక, ఆకులు, రంపపు పొట్టు నేలలో గాలి ప్రసరణకు, తేమను నిలిపేందుకు దోహదపడతాయి.
● అతి తక్కువ పరిమాణంలో యూరియా, డీఏపీ, పొటాష్, జింక్ కలిసి వేయాలి
● నీటిలో కరిగే ఎరువులను మొక్కల పై పిచికారి చేయాలి. కుండీల్లో నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలి
పర్యావరణాన్ని కాపాడాలి
పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరు భాగపస్వామ్యం కావాలి. వనమహోత్సం కార్యక్రమంలో భాగంగా పూలు, పండ్ల మొక్కలను ఇంటింటికి పంపిణీ చేస్తున్నాం. ప్రతీ ఒక్కరు మొక్కలు, నాటడంతో పాటుగా వాటిని కాపాడాలి.
– సునీత, మున్సిపల్ కమిషనర్, షాద్‌నగర్

హరితం.. ఆహ్లాదం