
24.12 ఎకరాలకు ఫెన్సింగ్
మహేశ్వరం: మండల పరిధిలోని మంఖాల్ రెవెన్యూ తుక్కుగూడ పరిధిలోని వర్టెక్స్ వెంచర్ సమీపం సర్వే నెంబర్ 68, 70, 71, 73, 85, 86లో ఉన్న 24.12 ఎకరాల ప్రభుత్వ భూమికి రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు పోలీసుల సహకారంతో శనివారం చుట్టూ రక్షణగా ఫెన్సింగ్ చేశారు. గతంలో ఈ భూమిని ప్రభుత్వం తుక్కుగూడలో భూమి లేని పేదలకు పంపిణీ చేసింది. సదరు భూమిని రైతులు ఓ రియల్ వ్యాపారికి విక్రయించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పీఓటీ నోటీసులు జారీ చేసి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి చుట్టూ పోలీసుల సహకారంతో రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు ఫెన్సింగ్ పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న పలువురు రియల్ వ్యాపారులు రెవెన్యూ, హెచ్‌ఎండీఓ అధికారులకు అడ్డుతగిలి మా పట్టా భూమిని స్వాధీనం చేసుకోవద్దంటూ వాగ్వావాదానికి దిగారు. ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి జోక్యం చేసుకుని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ వేస్తున్నామని, పట్టా భూమి జోలికి రావడం లేదని సర్ది చెప్పారు. పట్టా భూమి ఉంటే సర్వే చేసి కొలిచి చూపుతామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. దీంతో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి చుట్టూ పోలీసుల పహారాలో ఫెన్సింగ్ పనులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్, సీలింగ్ భూములను విక్రయిస్తే పీఓటీ కింద ప్రభుత్వం సాధీనం చేసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, హెచ్‌ఎండీఓ తహసీల్దార్ దివ్య, హెచ్‌ఎండీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుదర్శన్, మహేశ్వరం డిప్యూటీ తహసీల్దార్ నరేశ్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులతో వాగ్వాదానికి దిగిన రియల్టర్లు