
మహిళలు స్వయం శక్తితో ఎదగాలి
ఇబ్రహీంపట్నం రూరల్: మహిళలు స్వయం శక్తితో ఎదగాలని జిల్లా పట్టణ పేదరిక నిర్మూళన సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జి.వెంకటనారాయణ అన్నారు. మున్సిపాలిటీల్లో వంద రోజుల ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం మహిళా స్వయం శక్తి సంఘాల ఆధ్వర్యంలో ఆదిబట్ల మున్సిపల్ కార్యాలయంలో స్ట్రీట్ ఫుడ్ పెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకటనారాయణ మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని తెలిపారు. ఆర్థిక ప్రగతితో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేలా సహాయ సహకారాలు అందించాలని చెప్పారు. మహిళా స్వయం సహాయ సంఘాలను బలోపేతం చేయడానికి దశల వారీగా వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్ట్రీట్ వెండర్స్ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించామన్నారు. మహిళలను చైతన్యం చేసి స్వయం శక్తితో ఎదిగేలా చూడాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ బాలకృష్ణ, ఏడీఎంసీ అశోక్, చైతన్యం, మేనేజర్ రమేశ్, టీపీఓ అబీబున్నీసాబేగం, డీఈ స్వర్ణకుమార్, సీనియర్ అసిస్టెంట్ స్వప్న, స్వయం సహాయక సంఘాల మహిళలలు తదితరులు పాల్గొన్నారు.
మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటనారాయణ