మండలానికి ఒకరుంటే మేలు
ప్రభుత్వ భూములను గుర్తించాలి
కొందుర్గు: రోజురోజుకూ భూముల విలువలు పెరగడం.. క్రయవిక్రయాలు అధికం కావడంతో భూముల కొలతలు నిర్వహించడం తప్పనిసరిగా మారింది. చాలాకాలం క్రితం కొలవడంతో వ్యవసాయ భూములకు హద్దురాళ్లు లేకుండా పోయాయి. రైతులు ఒకరి భూముల్లో మరొకరు కబ్జాలో ఉండడం పరిపాటిగా మారింది. తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో గొడవలు లేకుండా భూములను కొలతలు చేయించుకొని హద్దురాళ్లు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. కానీ సర్వేయర్లు లేకపోవడంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఒక్కో మండలానికి ఒక సర్వేయర్ ఉండాల్సి ఉండగా కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలో ప్రభుత్వ సర్వేయర్లు సరపడా లేకపోవడంతో ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు మండలాల బాధ్యతలు అప్పగించారు.
ఆరు మండలాలకు ముగ్గురే..
షాద్‌నగర్ డివిజన్‌లోని ఆరు మండలాలలకు సంబంధించి ముగ్గురే సర్వేయర్లు ఉన్నారు. ఒక్కో సర్వేయర్‌కు రెండు మండలాల చొప్పున బాధ్యతలు అప్పగించారు. చేవెళ్ల డివిజన్ షాబాద్‌తోపాటు మహేశ్వరం, గండిపేట మండలాల బాధ్యతలు సైతం షాద్‌నగర్ డివిజన్‌లో పనిచేస్తున్న సర్వేయర్లకు ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వడంతో మరింత ఇబ్బందికరంగా మారింది. భూముల కొతలకు సంబంధించి దరఖాస్తులు కార్యాలయాల్లో పేరుకుపోతున్నాయి.
నాలుగు నెలలుగా ఆగిన సర్వేపనులు
ప్రభుత్వం భూ భారతి పోర్టల్ అందుబాటులోకి తేవడం.. గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడంతో సర్వే పనులు పెండింగ్‌లో పడ్డాయి. భూ భారతి చట్టం అమలులో భాగంగా జిల్లాలో కొందుర్గు మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. దీంతో ఈ మండలంలో మే నెలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో సర్వేయర్ పాల్గొనాల్సి వచ్చింది. జూన్ 3వ తేదీ నుంచి రాష్ట్రమంతా సదస్సులు నిర్వహించారు. ఇందులో భాగంగా కొందుర్గు సర్వేయర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సర్వేయర్ ఆంజనేయులు ఇన్‌చార్జి మండలాలైన జిల్లేడ్ చౌదరిగూడ, షాబాద్ మండలాల్లో జూన్‌లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు హాజరయ్యారు. ఆ వెంటనే లైసెన్స్‌డ్ సర్వేయర్ల శిక్షణ ఉండటంతో జూలై 29 నుంచి సెప్టెంబర్ 25 వరకు శిక్షణలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం కొందుర్గు మండలానికి 9 మంది, జిల్లేడ్ చౌదరిగూడ మండలానికి ఆరుగురు లైసెన్స్‌డ్ సర్వేయర్లను క్షేత్రస్థాయి శిక్షణ కోసం నియమించారు. వారు ఈనెల 7న ఆయా మండలాల్లో క్షేత్రస్థాయి శిక్షణ కోసం విధుల్లో చేరారు. ప్రస్తుతం వారికి సర్వేయర్ ఆంజనేయులు 40 రోజుల పాటు క్షేత్రస్థాయి శిక్షణ అందిస్తున్నారు. దీంతో భూముల కొలతల్లో జాప్యం జరుగుతోంది.
రెండుమూడు మండలాలకు ఒక్కరే..
అదనంగా ఇన్‌చార్జి బాధ్యతలు
పేరుకుపోతున్న దరఖాస్తులు
ముందుకు సాగని భూముల కొలతలు
లైసెన్స్‌డ్ సర్వేయర్లతోనైనా సమస్యలు తీరేనా?
అన్ని గ్రామాల్లో రైతుల పొలాలకు సంబంధించి హద్దురాళ్ల ఆచూకీ కనిపించకుండా పోయాయి. రైతుల మధ్య గొడవలు తప్పడం లేదు. ఒక్కో సర్వేయర్‌కు రెండు మూడు మండలాలు అప్పగిస్తే సర్వే పనులు ఎలా ముందుకు సాగుతాయి. మండలానికి ఒకరుంటే దరఖాస్తులు పెండింగ్‌లో ఉండవు.
– ప్రేమ్‌కుమార్, చెర్కుపల్లి
లైసెన్స్‌డ్ సర్వేయర్లకు క్షేత్రస్థాయి శిక్షణ ఇవ్వడం సంతోషకరమైన విషయం. వీరి శిక్షణలో భాగంగా అన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి హద్దురాళ్లను ఏర్పాటుచేయాలి. సర్కారు భూములు బయటకొస్తాయి. వాటిని అన్యాక్రాంతం కాకుండా చూడాలి.
– శెట్టి వజ్రలింగం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కొందుర్గు
సర్వేయర్ల కొరత!
సర్వేయర్ల కొరత!