చేపల పెంపకం కేంద్రాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి
కందుకూరు: కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి ఎస్పీసింగ్ బఘేల్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం మండల పరిధిలోని గూడూరు గేట్ వద్ద డీక్కీ (దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) నేషనల్ ప్రెసిడెంట్ నర్రా రవికుమార్ ఏర్పాటు చేసిన చేపల పెంపకం కేంద్రాన్ని సందర్శించారు. చేపల పెంపకం తీరు, దిగుబడి, ఖర్చులు, ఎగుమతి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి, రాష్ట్ర కిసాన్‌మోర్చా నాయకుడు పల్లె కృష్ణగౌడ్ తదితరులు ఘనంగా సన్మానించారు.
విద్యారంగ సమస్యలపై
అలుపెరగని పోరాటం
షాద్‌నగర్‌రూరల్: విద్యారంగ సమస్యలపై అలుపెరగని పోరాటం సాగిస్తున్నట్లు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి అన్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని వివిధ పాఠశాలల్లో శుక్రవారం సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. ఉపాధ్యాయులు సంఘటితంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. సమస్యల సాధనకు సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కువద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మహాధర్నా వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీదర్‌రెడ్డి ప్రధాన కార్యదర్శి బీవీఎం.రాజు, గౌరవ అధ్యక్షులు రాఘవేందర్, సురేష్‌సింగ్, రాష్ట్ర అసోసియేట్ సభ్యుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు
అతిక్రమిస్తే చర్యలు
యాచారం: గణేశ్ నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు సూచించారు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలోని మీరాఖాన్‌పేటలో శుక్రవారం మండపాల నిర్వాహకుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండపాల నిర్వాహకులు ముందే పోలీసులకు సమాచారం అందించాలని, నిబంధనల ప్రకారం విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాలని సూచించారు. డీజేలు పెట్టొద్దని, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నవరాత్రుల అనంతరం ఏ ప్రాంతాల్లో నిమజ్జనం చేస్తున్నారో ముందే సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐలు సైదులు, వంశీ పాల్గొన్నారు.
సేవలను గుర్తించి..
పురస్కారం అందించి
షాద్‌నగర్‌రూరల్: విధుల్లో నిబద్ధతను కనబరిచిన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్(డీఐ) వెంకటేశ్వర్లుకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ బంగారు పతకం, నగదు పురస్కారాన్ని అందజేసి అభినందించారు. రాజా బహదూర్ వెంకటరామారెడ్డి జయంతిని పురస్కరించుకొని శుక్రవారం రాజా బహదూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులను సత్కరించారు.
ఈ సందర్భంగా డీఐ వెంకటేశ్వర్లు సీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా బంగారు పతకం, నగదు పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా డీఐ మాట్లాడుతూ.. బంగారు పతకాన్ని అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, శంషాబాద్ డీసీపీ రాజేష్, ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
1/1
చేపల పెంపకం కేంద్రాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి