
ఇంటింటి ఫీవర్ సర్వే చేపట్టండి
● సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఏకధాటి వర్షాలు.. భారీ వరదల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు సోమవారం నుంచి ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పారిశుద్ధ్య నిర్వహణ పనులు, దోమల నియంత్రణ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ప్రతి రోజూ కాలనీలు/బస్తీల్లో ఫాగింగ్ చేయడంతో పాటు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. క్లోరినేషన్ తర్వాతే తాగునీటిని సరఫరా చేయాలని, పైపులైన్లకు లీకేజీలు లేకుండా, నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం గ్రామాల్లో డ్రైడే పాటించాలని, ఈ నెలాఖరులోగా వనమహోత్సవాన్ని పూర్తి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, సంబంధిత అధికారులు ల్గొన్నారు.
గణేశ్ ఉత్సవాలకు సిద్ధంకండి
ఇబ్రహీంపట్నం రూరల్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం గణేశ్ ఉత్సవాలపై డీసీపీలు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, పోలీసు శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించి మార్గదర్శకాలను అనుసరించి మండపాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. నిమజ్జనం కోసం జిల్లాలో 44 చెరువులను గుర్తించినట్లు తెలిపారు. శోభాయాత్ర నిర్వహించే రూట్లలో రోడ్లకు ప్యాచ్ వర్కులు చేయాలన్నారు. నిమజ్జనం చేసే ప్రాంతాల్లో క్రేన్లు, బారికేడ్లు, వేదికలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొవాలని ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా చూడాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, మెడికల్, శానిటేషన్ కంట్రోలింగ్ రూం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్‌కుమార్, శంషాబాద్ అడిషనల్ డీసీపీ రామ్‌కుమార్, మాదాపూర్ అడిషనల్ డీసీపీ సాయిరామ్, ఆర్డీఓలు అనంతరెడ్డి, చంద్రకళ, సరిత, జగదీశ్వర్‌రెడ్డి, ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ తదితరులు పాల్గొన్నారు.