
మహిళలకు కేంద్రం పెద్దపీట
చేవెళ్ల: మహిళలకు కేంద్రం పెద్దపీట వేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నా రు. చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే విధంగా చట్టంగా మార్చి అమలు చేసేందుకు కృషి చేస్తోందని తెలిపారు. మండలంలో ప్రారంభించిన పల్లెపల్లెకూ బీజేపీ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి ఖానాపూర్‌లో దళిత రైతు ఇంట్లో బస చేశారు. శుక్రవారం ఉదయం గ్రామంలోని రైతులు రవీందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి పంట పొలాలలను పరిశీలించి వారితో మాట్లాడారు. అక్కడి నుంచి ఆలూరులో మహిళా సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే నారీశక్తిని ఆర్థికశక్తిగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం పాటుపడుతోందని తెలిపారు. స్టాండప్ ఇండియా పథకం ద్వారా మహిళలు వ్యాపారం చేసుకునేందుకు రూ.10లక్షల నుంచి రూ.కోటి వరకు తక్కువ వడ్డికే రుణాలు అందించి చేయూత అందిస్తోందని చెప్పారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించి ఓ పార్టీ మోసం చేస్తే 19 నెలలే పాలించిన ఈ ప్రభుత్వం మరింత నాశనం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో రేవంత్‌సర్కార్ ప్రజలను మోసం చేస్తోందని ఎన్నికల్లో గెలిస్తే తులంబంగారం ఇస్తామని ఇవ్వలేదని, ఇందిరమ్మ ఇళ్లు, రైతు బంధు, రుణమాఫీ ఇవ్వలేదన్నారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం కల్పించి మార్పు చూడాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, జిల్లా కార్యదర్శి జి. వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, యువ నాయకుడు డాక్టర్ మల్గారి వైభవ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఎం.విజయలక్ష్మి, మండల అధ్యక్షుడు శ్రీకాంత్, మున్సిపల్ అధ్యక్షుడు అనంత్‌రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రంలో హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు