
సారు.. ఇదేం తీరు!
మొయినాబాద్: విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులే తప్పటడుగులు వేస్తున్నారు. నవ సమాజాన్ని నిర్మించాల్సిన ఉపాధ్యాయులు వృత్తికే కళంకం తెస్తున్నారు. మొన్న వెంకటాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించడమేకాకుండా ప్రశ్నించిన విద్యార్థిని తండ్రిని బూతులు తిట్టి చెప్పుతో దాడికి యత్నించాడు. ఈ సంఘటన మరవక ముందే హిమాయత్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు మద్యం తాగి వచ్చి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
మద్యం మత్తులో బడికి..
మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్‌నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఎండీ హిమాన్షహ కొన్ని రోజులుగా మద్యం తాగి పాఠశాలకు వస్తున్నాడు. మద్యం మత్తులో పాఠాలు చెప్పకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో గురువారం కొంత మంది పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని మందలించారు. శుక్రవారం గ్రామ పెద్దలతోపాటు ఉపాధ్యాయుడి కుటుంబ సభ్యులను పిలిపించి విషయాన్ని వివరించారు. తీరు మార్చుకోవాలని.. లేదంటే జిల్లా విద్యాధికారులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి మల్లయ్య పాఠశాలకు వెళ్లి వివరాలు ఆరాతీశారు. విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
సర్వత్రా విమర్శలు
మొయినాబాద్ మండలం వెంకటాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 25 రోజుల క్రితం హిందీ పండిత్ ప్రవీణ్‌కుమార్ పదో తరగతి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె తండ్రి పాఠశాలకు వెళ్లి అడిగాడు. దీంతో రెచ్చిపోయిన సదరు ఉపాధ్యాయుడు బూతులు తిడుతూ చెప్పుతో దాడికి ప్రయత్నించాడు. తోటి ఉపాధ్యాయులు వారించినా వినలేదు. ఈ ఘటనపై ఎంఈఓ మల్లయ్య జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. అయినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. షీటీం పోలీసులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడు, విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి వెళ్లారు. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వారిని విధుల నుంచి తొలగించాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
విద్యాబుద్ధులు నేర్పే గురువులే తప్పటడుగులు
మొన్న వెంకటాపూర్‌లో విద్యార్థినితో అసభ్య ప్రవర్తన
తాజాగా హిమాయత్‌నగర్‌లో మద్యం తాగి విధులకు..