తుర్కయంజాల్: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి కోరారు. శుక్రవారం ఆదిబట్ల ఠాణా పరిధి తుర్కయంజాల్‌లో వినాయక నవరాత్రి ఉత్సవాల కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ మాట్లాడుతూ.. విగ్రహాల తరలింపులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఈ ఏడాది ఇప్పటికే తొమ్మది మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. వర్షాలు నేపథ్యంలో తేమ కారణంగా మూడు ఫీట్ల దూరంలో ఉన్నప్పటికీ విద్యుత్ తీగల నుంచి ప్రమాదం పొంచి ఉంటుందని సూచించారు. ప్రభుత్వం 11 రోజుల పాటు మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నప్పటికీ కొందరు విద్యుత్ శాఖ వారిని సంప్రదించకుండా నిర్లక్ష్యంగా తీగలకు కొండీలను తగిలిస్తున్నారని ఇది సరికాదన్నారు. ఐఎస్‌ఐ మార్క్‌తో పాటు ఎంసీబీని కొనుగోలు చేసి సమాచారం ఇస్తే విద్యుత్ శాఖ సిబ్బంది లీగల్‌గా కనెక్షన్‌ను ఇస్తారని చెప్పారు. వినాయకుడి వద్ద ఉంచే దీపం విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. విద్వేషాలకు, వివాదాలకు తావివ్వకుండా పండుగను నిర్వహించుకోవాలని, ముందు తరాలకు ఆదర్శంగా ఉండేలా నిర్వాహకులు మెలగాలని కోరారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుందని, పోలీసులకు సహకరించాలని కోరారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను ప్రశాంతంగా ముగిసేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిబట్ల సీఐ రవి కుమార్, మున్సిపల్ డీఈ భిక్షపతి, విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ శాఖల అధికారులతో పాటు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి