
కాలుష్య కారక పరిశ్రమను మూసేయండి
షాబాద్: కాలుష్యానికి కారణమైన కుందనా పరిశ్రమను వెంటనే మూసివేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని చందనవెల్లి రెవెన్యూలో కొనసాగుతున్న కుందానా కంపెనీ ఎదుట గ్రామస్తులతో ఆందోళన చేపట్టారు. అనంతరం కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐ కాంతారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమ నుంచి రసాయనాలతో కూడిన పొల్యూషన్ వల్ల ఎన్నో పశువులు మృత్యువాత పడ్డాయని ఆరోపించారు. రసాయనాలు పంట పొలాల్లోకి వెళ్లి పంటలు దెబ్బతింటున్నాయని చెప్పారు. పొల్యూషన్ కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులు వాంతులు, విరోచనాలు చేసుకుంటున్నారని వాపోయారు. రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిశ్రమల శాఖ పరిశ్రమను పరిశీలించి సీజ్ చేయాలన్నారు. లేదంటే కంపెనీ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మాజీ సర్పంచ్ కొలన్ ప్రభాకర్‌రెడ్డి, సీఐటీయూ మండల ఉపాధ్యక్షుడు భీమయ్య, అరుణ్‌కుమార్, సీనియర్ నాయకులు చేవెళ్ల స్వామి, యాదయ్య, గ్రామస్తులు, తదితరులున్నారు.
సీఐటీయూ జిల్లా
సహాయ కార్యదర్శి దేవేందర్