
పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం
● ‘పనుల జాతర’కు స్పందన కరువు
● కార్యక్రమంపై ప్రజలకు
సమాచారం ఇవ్వని సెక్రటరీ
కేశంపేట: ప్రభుత్వానికి ప్రజలకు వారిధిగా ఉద్యోగులు తమ విధులను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడంలో వారిదే ప్రముఖ పాత్ర. పాపిరెడ్డిగూడ పంచాయతీ కార్యదర్శి పనితీరు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. వివరాలు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనుల జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అన్ని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు ప్రారంభించి అనంతరం గ్రామసభ నిర్వహించాలని మండలాధికారులు సూచించారు. ఈ గ్రామసభలకు గ్రామ ప్రత్యేక అధికారులతో పాటుగా మాజీ ప్రజాప్రతినిధులను, గ్రామస్తులను ఆహ్వానించాలని చెప్పారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా పనుల కోసం దరఖాస్తులను స్వీకరించాలని, ప్రభుత్వం అందిస్తున్న ఉపాధి, లబ్ధి తదితర విషయాలను వివరించాలన్నారు. పాపిరెడ్డిగూడ పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా గ్రామస్తులకు సమాచారం ఇవ్వకుండానే గ్రామసభను ఏర్పాటుచేశాడు. ప్రజలు అందుబాటులో లేక రోడ్డు పైన వెళ్తున్న వారిని నలుగురిని తీసుకువచ్చి గ్రామసభను నిర్వహించాడు. గ్రామస్తులకు మందస్తు సమాచారం అందించకపోవడంతో గ్రామంలో పనుల జాతర కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువైంది.