
బాదుడు!
న్యూస్‌రీల్
రెట్టింపు కానున్న ఖర్చు
ఫ్యూచర్‌సిటీతోనే అభివృద్ధి ఫార్మాసిటీ బదులు ఫ్యూచర్‌సిటీ నిర్మిస్తున్నామని, ప్రజల మద్దతు అవసరమని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు.
లోడు..
భారంగా కొత్త విద్యుత్ కనెక్షన్లు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కొత్త విద్యుత్ కనెక్షన్లు వినియోగదారులకు షాక్ ఇవ్వనున్నాయి. అపార్ట్‌మెంట్లు, మల్టీస్టోరేజ్, హైరేజ్ బిల్డింగ్స్‌లోని గృహాల విద్యుత్ (ఎల్‌టీఎం) కనెక్షన్లు మరింత భారం కానున్నాయి. వినియోగదారుడి అవసరం, అభిప్రాయంతో సంబంధం లేకుండా డిస్కమే స్వయంగా కనెక్టివిటీ లోడు నిర్ణయించడం, ఈ మేరకు కచ్చితమైన నిబంధనలు అమల్లోకి తేవడంతో ఆయా గృహ విద్యుత్ వినియోగదారులు ఆర్థిక భారం మోయకతప్పని పరిస్థితి నెల కొంది. సింగిల్ బెడ్‌రూమ్ ఇంటికి రెండు కిలోవాట్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి ఐదు, త్రిబుల్‌బెడ్‌రూమ్ ఇంటికి పది, నాలుగు అంతకంటే ఎక్కువ బెడ్‌రూమ్‌లున్న ఇంటికి 15 కిలోవాట్ల లోడును తప్పనిసరి చేసింది. వినియోగదారులంతా దరఖాస్తు సమయంలో ఆయా కిలోవాట్లకు నిర్దేశించిన ఫీజు మొత్తాన్ని చెల్లించాలని సూచించింది. ఫలితంగా కొత్తగా ఇల్లు కట్టుకోవాలని భావించిన వారిపై గతంతో పోలిస్తే అదనపు భారం తప్పడం లేదు.
తక్కువ సామర్థ్యం లోడుతో దరఖాస్తు
ప్రస్తుతం గ్రేటర్ జిల్లాల్లో 64 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా వీటిలో 53 లక్షల గృహ, మరో 8 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో డిమాండ్ 68 నుంచి 70 మిలియన్ యూనిట్లు నమోదవుతుండగా వేసవిలో 90 మిలియన్ యూనిట్లు దాటుతోంది. దీనికి తోడు నెలకు సగటున 2,500పైగా కొత్త కనెక్షన్లు వచ్చి చేరుతున్నాయి. మెజార్టీ నిర్మాణ సంస్థలు/ బిల్డర్లు భవిష్యత్తు అవసరాలను పరిగణలోకి తీసుకోవడం లేదు. ఒక్కో ప్లాటుకు ఒక కిలోవాట్ చొప్పున కనెక్టివిటీ లోడు నిర్ణయించి, ఆ మేరకు కిలోవాట్‌కు రూ.1,616 ఫీజు చెల్లించి కొత్త కనెక్షన్లకు దరఖాస్తు చేస్తున్నారు. తీరా గృహ ప్రవేశం తర్వాత ఎంచుకున్న లోడుకు మించి విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. సామర్థ్యానికి మించి వినియోగిస్తుండడంతో వేడికి వైర్లు ఒత్తిడికి లోనై కాలిపోవడంతో పాటు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లు తీవ్ర ఒత్తిడికి లోన వుతున్నాయి. లో ఓల్టేజీ కారణంగా సరఫరాలో హెచ్చుతగ్గుల సమస్య తలెత్తి ఇంట్లో విలువైన విద్యుత్ గృహోపకరణాలు కాలి బూడిదైపోతున్నాయి. భవిష్యత్తు అవసరాల మేరకు ముందే కనెక్టివిటీ లోడు ఎంపిక చేసుకుంటే సమస్యలు ఉండవని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ స్పష్టం చేస్తోంది. ఇంటి నిర్మాణ ప్లాన్, కిచెన్లు, పడకగదుల నిష్పత్తి ఆధారంగా కనెక్షన్లు, కనెక్టివిటీ లోడు ముందే ఎంపిక చేసుకోవడం ద్వరా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ నిర్ణయంతో కొత్తగా ఇళ్లు నిర్మించుకుని, విద్యుత్ కనెక్షన్లు పొందాలని భావించిన పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడనుంది.
విస్తీర్ణాన్ని బట్టి డిస్కం మోత
సింగిల్ బెడ్‌రూమ్, డబుల్, త్రిబుల్, ఫోర్ బీహెచ్‌కేకు విడివిడిగా కనెక్టివిటీ లోడు
వినియోగదారులకు షాక్
కొత్త నిబంధనలతో ఆందోళన
ఔటర్ రింగ్ రోడ్డుకు అటుఇటుగా అనేక కొత్త అపార్ట్‌మెంట్లు, మల్టీ స్టోరేజ్ భవనాలు, హైరేజ్ నిర్మాణాలు వెలుస్తున్నాయి. వినియోగదారుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా ఆయా నిర్మాణ సంస్థలు తక్కువ కనెక్టివిటీ లోడు కనెక్షన్లు తీసుకుంటున్నాయి. నిజానికి గతంలో ఏడాది సగటు విద్యుత్ వినియోగాన్ని పరిగణలోకి తీసుకుని, కనెక్టివిటీ లోడుకు మించి విద్యుత్‌ను వినియోగించిన వారికి నోటీసులు జారీ చేసేవారు. డెవెలప్‌మెంట్ చార్జీలు వసూలు చేసి, ఆ మేరకు పబ్లిక్ డీటీఆర్, సబ్‌స్టేషన్లలోని పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచేవారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంతో ఆయా వినియోగదారులంతా కనెక్షన్ల కోసం గృహ ప్రవేశానికి ముందే భారీగా ఖర్చు చేయాల్సి వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

బాదుడు!