దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టొద్దు
● భూభారతికి ప్రాధాన్యత ఇవ్వాలి
● సత్వరమే పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: భూ భారతి దరఖాస్తులు, ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టకుండా త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఆదేశించారు. భూభారతి దరఖాస్తులు, ఇతర అంశాలపై సంబంధిత ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులతో గురువారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో ఆయా మాడ్యుల్స్‌లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? ఎంత మందికి నోటీసులు ఇచ్చారు? క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూభారతి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా రోజువారీగా పరిశీలనను పర్యవేక్షిస్తూ, వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, పరిష్కారంకాకుంటే దరఖాస్తుదారుడికి సమా చారం అందించాలని ఆయన సూచించారు. గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యం పక్కదారి పట్టకుండా చూడాలని సివిల్ సప్లయ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూములను గుర్తించి, ఆక్రమణలకు గురికాకుండా చూడాలని, ఆక్రమణలకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాలని, ఆక్రమణదారులుపై చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ సంగీత, ఆర్డీవోలు, తహసీల్దార్లు, సివిల్ సప్లయ్ అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం సేకరణకు సిద్ధంకండి
ఇబ్రహీంపట్నం రూరల్: రానున్న ఖరీఫ్ సీజన్‌లో అవసరమైన ధాన్యం సేకరించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై గురువారం అదనపు కలెక్టర్ చాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 33 వేల హెక్టార్ల ధాన్యం సేకరణ అంచనా వేసినందున, ఎక్కడా సమస్య తలెత్తకుండా చూడాలని అన్నారు. ధాన్యం కొనుగోలుకు 33 కేంద్రాలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరును మరోసారి పరిశీలించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన పరికరాలు, గన్నీ బ్యాగులు, టార్పిలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ అధికారి వనజాత, జిల్లా మేనేజర్ గోపీకృష్ణ, డీఆర్‌డీఓ శ్రీలత, వ్యవసాయాధికారి ఉష, జిల్లా కో ఆపరేటివ్ అధికారి సుధాకర్, మార్కెటింగ్ శాఖ అధికారి రియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


