
ఏసీబీ కేసు.. రెండు రోజులకే ఆఫీసు!
● ఏకంగా సీట్లో కూర్చొని పలు దస్త్రాలపై సంతకాలు
● చర్చనీయాంశమైన ఆమనగల్లు తహసీల్దార్ లలిత తీరు
● సస్పెన్షన్ వేటు.. కేసు నమోదుకు
కలెక్టర్ సిఫార్సు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మూడు రోజుల క్రితం ఏసీబీ అదుపులో ఉన్న తహసీల్దార్ గురువారం ఏకంగా అదే ప్రభుత్వ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. ప్రభుత్వ అధికారిగా సీట్లో కూర్చొని, ఏకంగా పలు దస్త్రాలపై సంతకాలు సైతం చేశారు. కార్యాలయ ఉద్యోగులంతా అవాక్కయ్యారు. ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి లోనయ్యారు. పట్టాదారు పాసు పుస్తకంలో దొర్లిన పేరు తప్పిదాన్ని సరి చేసేందుకు ఆమనగల్లు తహసీల్దార్ లలిత ఓ రైతు నుంచి డబ్బులు డిమాండ్ చేసింది. అప్పటికే సర్వేయర్ రవి సహకారంతో రూ.50 వేలు తీసుకుంది. మరింత మొత్తం కావాలని డిమాండ్ చేయడంతో సదరు బాధితుడు చేసేది లేక ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఈ నెల 19న అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆమనగల్లు తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వ హించారు. తహసీల్దార్ లలిత, మండల సర్వేయర్ కోట రవిపై కేసు నమోదు చేశారు. చర్యలు తీసుకోవాల్సిందిగా కోరు తూ కలెక్టర్‌కు నివేదించారు. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. నిజానికి వారిద్దరినీ అరెస్ట్ చేసి, జైలుకు తరలించినట్లు అంతా భావించారు. కానీ ఏసీబీ అధికారులు అలా చేయకుండా కేవలం నోటీసులిచ్చి వదిలేశారు. దీన్ని సదరు తహసీల్దార్ అవకాశంగా తీసుకున్నారు. బుధవారం విధులకు దూరంగా ఉన్నప్పటికీ గురువారం ఏకంగా ఆఫీసులో ప్రత్యక్షమై పలు దస్త్రా లపై సంతకాలు కూడా చేశారు. మధ్యాహ్నం ఒకటిన్నర వరకు సీట్లోనే కూర్చొని కనిపించారు.
తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు
అవినీతి ఆరోపణల కేసును ఎదుర్కొంటున్న తహసీల్దార్ లలితను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. భూభారతి లాగిన్ సహా ప్రభుత్వ సిమ్‌కార్డును సైతం మార్చివేసినట్లు తెలిపారు. ఏసీబీ కేసు నమోదైన తర్వాత విధులకు హాజరు కావడం నేరమని, విషయం తెలిసిన వెంటనే డిప్యూటీ తహసీల్దార్ వినోద్‌కుమార్ ద్వారా సదరు తహసీల్దార్‌పై ఆమనగల్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయించినట్లు తెలిపారు. కేసు నమోదు చేయాల్సిందిగా కోరుతూ డీటీ ద్వారా తమకు ఫిర్యాదు అందిందని, ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయనున్నట్లు ఆమనగల్లు ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు.