
గణేశ్ ఉత్సవాల్లో అప్రమత్తంగా ఉండాలి
కందుకూరు: వినాయ చవితి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని మహేశ్వరం ఏసీపీ ఎస్.జానకీరెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని ఎంఆర్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో గురువారం సీఐ సీతారాం ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. మండపాల నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. మండపాల ఏర్పాటుపై ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. విద్యుత్ సరఫరా కోసం నాణ్యమైన విద్యుత్ తీగలనే వాడాలన్నారు. డీజేకు అనుమతి లేదన్నారు. ప్రధాన మండపాల వద్ద నిర్వాహకులే సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు. ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాల్, ఎంపీడీఓ సరిత, విద్యుత్ ఏఈ వేణుగోపాల్‌రెడ్డి, ఆర్ అండ్ బీ ఏఈ రవి, ఫైర్ ఆఫీసర్ నాగార్జున, మెడికల్ ఆఫీసర్ ఉమెరా సుల్తానా పాల్గొన్నారు.