
ఆన్‌లైన్‌లో వాటర్ ఫీజిబిలిటీ సర్టిఫికెట్
ధ్రువపత్రాన్ని జారీ చేసే ప్రక్రియను సులభతరం ● ఆన్‌లైన్ సేవలు ప్రారంభించిన జలమండలి ఎండీ
సాక్షి,సిటీబ్యూరో: మహానగర పరిధిలో నూతన భవన నిర్మాణదారులకు జలమండలి ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా భవనాలు నిర్మించుకునే వారు జీహెచ్‌ఎంసీ అనుమతుల కోసం సమర్పించాల్సిన వాటర్ ఫీజిబిలిటీ ధ్రువపత్రాన్ని జారీ చేసే ప్రక్రియను సులభతరం చేసి ఆన్‌లైన్ లోనే పొందేలా సరికొత్త సదుపాయాన్ని కల్పించింది. గురువారం జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ కలిసి జూబ్లీహిల్స్ లోని జలమండలి థీమ్ పార్క్ లో ఆన్‌న్‌లైన్‌లో వాటర్ ఫీజబిలిటీ ధ్రువపత్రాన్ని జారీ చేసే సేవలను లాంఛనంగా ప్రారంభించారు.
● గ్రేటర్ పరిధిలోని నూతన భవనం నిర్మించాలంటే జీహెచ్‌ఎంసీ పర్మిషన్ తప్పనిసరి. ఆ పర్మిషన్ కోసం భవన యజమానులు విద్యుత్ ఫీజబిలిటీ తో పాటు జలమండలి జారీ చేసే వాటర్ ఫీజిబిలిటీ ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ఈ సర్టిఫికెట్స్ పొందాలంటే జలమండలి సర్కిల్ కార్యాలయాల్లో, తర్వాత ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో సీజీఎం జారీ చేసేవారు. వివిధ కారణాల రీత్యా ఈ ప్రక్రియలో జాప్యం జరిగేది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ధ్రువపత్రాల జారీని ఆన్‌లైన్‌లోనే పొందేలాగా మార్పులు చేశారు.
ధ్రువపత్రాలు జారీ ఇలా...
జలమండలి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బి వెబ్‌సైట్ ద్వారా నీటి ఫిజిబిలిటీ సర్టిఫికెట్ కోసం ఆనన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దీని కోసం అప్లై ఆన్‌లైన్ ఫర్ వాటర్ ఫీజిబులిటీ సర్టిఫికెట్ అనే లింక్ అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు సమర్పించిన వెంటనే ఫైల్ నంబర్ జనరేట్ అవుతోంది. అవసరమైన పత్రాలను దరఖాస్తు సమయంలోనే అప్‌లోడ్ చేయాలి. ఇండెమ్నిటీ బాండ్‌ను రికార్డ్ కీపింగ్ కోసం సమర్పించాల్సి ఉంటుంది.
● ఒక్కో దరఖాస్తుపై రూ. 5,000 ప్రాసెసింగ్ ఫీజును నగదు కౌంటర్, ఆన్‌న్‌లైన్ విధానం ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. కనెక్షన్ చార్జీలు అందిన ఫైళ్లకు ఎస్‌ఎంఎస్ నోటిఫికేషన్ ఆధారంగా సీజీఎం (రెవెన్యూ) డిజిటల్ సంతకంతో ఫిజిబిలిటీ సర్టిఫికేట్ జారీ చేస్తారు.