
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు సలీం
షాద్‌నగర్: జర్నలిస్టులు మీడియా చట్టాలపై అవగాహన పెంచుకోవాలని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు ఎండీ.సలీం అన్నారు. గురువారం పట్టణ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) షాద్‌నగర్‌శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర మఫిషియల్ కమిటీ చైర్మన్ గుడుపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ఎండి.సలీం హాజరై మాట్లాడుతూ.. పడిపోతున్న మీడియా విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి జర్నలిస్టుపై ఉందన్నారు. సమాజంలో సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా పెరిగిపోవడంతో మీడియా విలువలు తగ్గుతున్నాయన్నారు. ప్రస్తుతం మీడియాలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చేందుకు కొత్త మార్గదర్శకాలు రూపొందుతున్నాయన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు వస్తాయన్నారు. అనంతరం డివిజన్ నూతన ప్రింట్ మీడియా కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రీశైలం, భాస్కర్, రమేష్, రాఘవేందర్‌యాదవ్, నర్సింహ, ఫయాజ్, శ్రీనివాస్, విష్ణు, సాబేర్, శ్రీకాంత్, సంతోష్, శంకర్, శివ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
వలస కూలీ వద్ద గంజాయి లభ్యం
కేసు నమోదు చేసిన పోలీసులు
కేశంపేట: ఒడిషాకు చెందిన వలసకూలీ గురువారం గంజాయితో పోలీసులకు చిక్కాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగెం శివారులోని ఓ పౌల్ట్రీఫాంలో ఒడిషాకు చెందిన బిస్వాంత్ మేహర్ భార్యతో కలిసి జీవిస్తున్నాడు. సొంత రాష్ట్రంలో తన అమ్మానాన్నల వద్ద ఉన్న కూతురును చూసే సాకుతో రెండు నెలలకోసారి ఒడిషాకు వెళ్తాడు. తిరిగి వచ్చే క్రమంలో గంజాయి వెంటతెస్తాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు గురువారం పౌల్ట్రీఫాంలో బిస్వాంత్ మేహర్ గదిని తనిఖీ చేయగా 46 గ్రాముల గంజాయి లభించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నరహరి తెలిపారు.
ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్
సికింద్రాబాద్: కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రమాదం బారిన పడిన ఒక మహిళ ప్రాణాలను అక్కడే విధుల్లో ఉన్న ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ రక్షించాడు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాలను సికింద్రాబాద్ డివిజనల్ సెక్యురిటీ ఆఫీసర్ ఏ.నవీన్‌కుమార్ గురువారం వెల్లడించారు. ఈనెల 20న సాయంత్రం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరుతున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కేందుకు శ్రీకాకుళం జిల్లా కాంచిలికి చెందిన ముప్పినేటి సారద్ అనే 52 ఏళ్ల మహిళ ఎక్కే ప్రయత్నం చేసింది. బీ2 బోగీ ఎక్కబోయిన మహిళ అదుపు తప్పి కిందపడింది. అదే సమయంలో అక్కడే విధుల్లో ఉన్న ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌సంజయ్‌కుమార్ ప్రమాదం బారిన పడుతున్న మహిళను గుర్తించి బయటకు లాగి బోగీ, ప్లాట్‌ఫామ్ మధ్య నలిగిపోకుండా రక్షించాడు. విధుల్లో అప్రమత్తంగా ఉండి ప్రమాదం బారిన పడిన మహిళను రక్షించిన కానిస్టేబుల్ సంజయ్‌కుమార్‌ను ఆర్‌పీఎఫ్ అధికారులు అభినందించారు.

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి