చేవెళ్ల: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి మూర్చ వ్యాధితో పాడి పోయి మృతి చెందాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని కేసారం బస్‌స్టేజీ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రాయిచూర్ గ్రామానికి చెందిన సురేశ్(30) భార్య సోనీలు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. సురేశ్‌కి మూర్చ వ్యాధితో పాటు మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 19న భార్యాభర్తలు నగరంలో ఉండే సురేశ్ సోదరుడు హనుమంతు వద్దకు ఆస్పత్రికి చూపించుకునేందుకు వెళ్లారు. అక్కడే ఉండగా 20న సురేశ్ ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు.
ఆయన మద్యం తాగి హైదరాబాద్ నుంచి తాండూరుకు వెళ్లేందుకు బస్సు ఎక్కి చేవెళ్లలో దిగిపోయాడు. కేసారం గేట్ వద్ద అతనికి మూర్చ రావడంతో అక్కడే కిందపడి మృతి చెందాడు. స్థానికులు గమనించి గురువారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెళ్లి పరిశీలించి అతని వద్ద లభించిన ఆధారాలతో విచారణ చేయగా కొడంగల్‌కు చెందిన సురేశ్‌గా గుర్తించారు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. భార్య సోని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నాలుగు గుర్తుతెలియని మృతదేహాలు స్వాధీనం
చిలకలగూడ: వేర్వేరు ఘటనల్లో నాలుగు గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను చిలకలగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది, చిలకలగూడ పోలీసులు తెలిపిన మేరకు.. సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి ప్రాంగణంలోని వెయిటింగ్‌హాలు వద్ద రెండు రోజులుగా ముగ్గురు వ్యక్తులు అపస్మారకస్ధితిలో ఉన్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అత్యవసర విభాగంలో చేర్పించారు. చికిత్సపొందుతూ గురువా రం గుర్తుతెలియని ముగ్గురు మృతి చెందారు. మృతులంతా గాంధీఆస్పత్రి పరిసర ప్రాంతా ల్లో నివసించే యాచకులుగా భావిస్తున్నారు.
మైలార్‌గడ్డలో...
సీతాఫల్‌మండి మైలార్‌గడ్డలో బాలాజీ స్వీట్‌షాపు సమీపంలో ఓ వ్యక్తి అనారోగ్యంతో పడున్నట్లు గస్తీ పోలీసులు గుర్తించారు. ప్రత్యేక వాహనంలో గాంధీ అత్యవసర విభాగానికి తరలించగా, చికిత్స పొందుతు గురువారం మృతిచెందాడు. కుటుంబసభ్యులు గుర్తించేందుకు మార్చురీలో భద్రపరిచామని పోలీసులు తెలిపారు.