
విద్యుత్ తీగల కింద వినాయక మండపం
● గాలి వీచడంతో హైటెన్షన్ వైర్లపై పడిన ప్లాస్టిక్ కవర్లు
● అప్రమత్తతతో తప్పిన ముప్పు
తుర్కయంజాల్: వినాయక మండపాల ఏర్పాటు, తరలింపులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నా కొందరిలో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. పోలీసుల హెచ్చరికలను కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటంతో ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు వరుసగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా గురువారం ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాగన్నగూడ సూరజ్‌నగర్ కాలనీలో హైటెన్షన్ లైన్ కింద కొందరు యువకులు మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం పైకప్పుగా వేసిన కవర్లు గాలికి ఎగిరి హైటెన్షన్ లైన్‌పై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్రమత్తమైన యువకులు వెంటనే పక్కకు తప్పుకుని, పోలీసులకు సమాచారం అందించారు. కరెంట్ సరఫరాను నిలిపివేయించి, జేసీబీ సాయంతో మండపాన్ని తొలగించారు. విద్యుత్ తీగలకు దూరంగా మరోచోట ఏర్పాటు చేసుకోవాలని యువకులకు పోలీసులు సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.