
గ్రాంటు రాక.. ఖర్చు చేయలేక!
కేశంపేట: బడులు తెరిచి రెండు నెలలు దాటినా పాఠశాల గ్రాంట్లు విడుదల కాలేదు. దీంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు, చాక్‌పీసులతోపాటు డస్టర్లు, స్టేషనరీ కొనుగోలుకు తమ జేబుల్లోంచి వెచ్చిస్తున్నారు. గతంలో పాఠశాల ప్రారంభంలోనే గ్రాంట్లు విడుదల చేసేవారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,300 పాఠశాలలు ఉన్నాయి. అన్ని స్కూళ్లకు ఇప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో కలిసి సమకూర్చుకుంటున్నారు.
విద్యార్థుల సంఖ్యను బట్టి..
పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రభుత్వం రెండు రకాలుగా గ్రాంట్లు విడుదల చేస్తోంది. పాఠశాల గ్రాంటు, స్పోర్ట్స్ గ్రాంటు రూపంలో ఇస్తోంది. ఈ నిధులను పాఠశాల అకౌంట్‌లో జమ చేస్తుంది. వీటిని అవసరాల మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో పాటు సీనియర్ ఉపాధ్యాయుడు సంయుక్తంగా చెక్కుపై సంతకం చేసి డ్రా చేస్తారు. పాఠశాల గ్రాంటు నుంచి కరెంట్ బిల్లులు చెల్లించడం, మరుగుదొడ్ల పరిశుభ్రత, చాక్‌పీసులు, డస్టర్లు, స్టేషనరీలాంటివి కొనుగోలు చేస్తారు. స్పోర్ట్స్ గ్రాంటు నుంచి విద్యార్థుల కోసం క్రీడాసామగ్రి కొనుగోలుకు వెచ్చిస్తారు.
నిధులు ఇలా (రూపాయల్లో..)
పిల్లల సంఖ్య పాఠశాల గ్రాంట్ స్పోర్ట్స్ గ్రాంట్
1–15 10,000 5,000
16–100 25,000 5000
101–250 50,000 5000
251–1000 75,000 10,000