
నూనె గింజల సాగుతో మంచి రాబడి
షాబాద్: నూనె గింజల సాగుతో రైతులకు మంచి ఆదాయం వస్తుందని భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ డైరెక్టర్ మతూర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని రేగడిదోస్వాడలో మంగళవారం భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో నూనె గింజల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక పథకంలో భాగంగా నూనె తీసే యంత్రాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. అధిక దిగుబడినిచ్చే విత్తనాలు అధివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణ తదితర అంశాలపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నట్లు చెప్పారు. సేవా స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వొంగూరు విజయ్ భాస్కర్‌రెడ్డి, సీఈవో చందన షెడ్యూల్ కులాల ఉప పథకం ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను వివరించారు. కార్యక్రమంలో సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ రత్నాకర్, సుగుణ మాల రైతు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు లింగం, సంఘం సభ్యులు పాల్గొన్నారు.